సినీ నిర్మాతలకు కార్మిక సంఘాలు డెడ్ లైన్.. రేపటి నుంచి అన్ని షూటింగ్‌లు బంద్

సినీ నిర్మాతలకు కార్మిక సంఘాలు డెడ్ లైన్..  రేపటి నుంచి అన్ని షూటింగ్‌లు బంద్

టాలీవుడ్ లో సంక్షోభం మరింత తీవ్రతరం అవుతోంది.  వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య అనేక సార్లు చర్చలు జరిగినా ఫలితం మాత్రం కొలిక్కిరాలేదు. ఫిల్మ్ నగర్ లో కార్మికులు ఆందోళనకు దిగారు. నిర్మాతల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి పిలుపు వచ్చి.. చర్చలు కొలిక్కి వస్తే సరే సరి లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని ఫిల్మ్ పెడరేషన్ హెచ్చరించింది.

వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు తీసుకున్న నిర్ణయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రోజువారి వేతనాలు తీసుకునే 13 సంఘాలకు ఒకే విధంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.  నిర్మాతలు విధించిన షరతులను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పారు. కార్మికులను విభజించేలా నిర్మాతల నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చల కోసం సాయంత్రం వరకు డెడ్ లైన్ ఇస్తున్నాం. రేపటి నుంచి సంపూర్ణంగా షూటింగ్స్ అన్ని బంద్ కాబోతున్నాయని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ప్రకటించారు.

మరోవైపు సినీ నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులపై కార్మిక సంఘాలు రగిలిపోతున్నాయి. ఆయన నోటీసులపై కోర్టులోనే తేల్చుకుంటాం.. అప్పటి వరకు ఆయనకు సంబంధించిన సినిమా షూటింగ్ లకు హాజరుకాబోమని తెలిపారు. ఇప్పటి వరకు విశ్వప్రసాద్ ఇవ్వాల్సిన రూ. 90 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని  ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కోరారు.  ఫిల్మ్ ఛాంబర్ తీసుకునే నిర్ణయం పై తన తదుపరి కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. 

►ALSO READ | Nagarjuna: ‘కూలీ’ థియేటర్స్‌లో ‘శివ’ రీ రిలీజ్‌ ట్రైలర్.. ఆగస్టు 14న మోత మోగాల్సిందే !

విశ్వప్రసాద్ నోటీసులపై ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ బాసాటి కృష్ణ  తీవ్రంగా మండిపడ్డారు.  నోటీసులకు భయపడటానికి మీ ఇంట్లో పని మనుషులం కాదు. కార్మిక శక్తిని అడ్డుకుంటే ఎంతదూరమైనా వెళ్తాం అని హెచ్చరించారు. కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతున్నారు. నోటీసులు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి..  లేకపోతే విశ్వప్రసాద్ సినిమా షూటింగ్స్ లో పాల్గొనబోం అని తేల్చిచెప్పారు. చిరంజవి మాతో టచ్ లో ఉన్నారు-ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు తెలిపారు. కార్మికుల చర్చల విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. శాంతియుతంగా ఈ సమస్య పరిష్కరించకుంటారని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.