వరి నాట్లకు కూలీలు దొరకట్లే

వరి నాట్లకు కూలీలు దొరకట్లే

వరుస వానలతో జోరందుకున్న  ఎవుసం పనులు
సీజన్​ ఆలస్యం కావడంతో ఒకేసారి నాటు పనుల్లో రైతులు
కూలీలు దొరకక పరేషాన్​
ఎకరా వరి నాటుకు  రూ.5వేలపైనే  ఖర్చు


మహబూబాబాద్​, వెలుగు:  రాష్ట్రంలో వారం రోజులుగా జోరుగా వానలు పడ్తున్నాయి. ఈసారి వానలు ఆలస్యంగా రావడంతో  ఎవుసం పనులు కూడా లేటయ్యాయి.  అడపాదడపా పత్తి, మక్క, కంది లాంటి  విత్తనాలు వేసుకున్న రైతులు, ఇప్పటివరకూ వరి నాట్ల జోలికి పోలేదు. తాజాగా కురుస్తున్న వానలతో అంతటా వరినాట్లు వేస్తుండడంతో గ్రామాల్లో కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు కూలీల కోసం చుట్టుపక్క గ్రామాలను గాలిస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెప్పించి నాట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అదనుగా గుత్తకు నాట్లు వేసే కూలీలు రేట్లు పెంచారు.  గతంలో ఎకరాకు రూ.3 నుంచి 4వేల దాకా తీసుకునేవాళ్లు ఈసారి  రూ.5వేల దాకా అడుగుతున్నారు. రానుపోను ఆటోచార్జీలు కూడా పెట్టుకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 

కూలీలకు మస్తు డిమాండ్..
 గ్రామాల్లో చెరువులు,  కుంటలు నిండి వరి పంటకు అనుకూల వాతావరణం ఏర్పడడంతో రైతులు వరి పంటను విరివిగా సాగు చేస్తున్నారు.  ట్రాక్టర్లతో దుక్కులు దున్నడం, గొర్రు తోలడం చేస్తుండగా నాట్లు వేయడానికి  మహిళా కూలీల సేవలను వాడుకుంటున్నారు. గతంలో ఎకరం విస్తీర్ణంలో నాటు వేయడానికి రూ.3వేల వరకు చెల్లించేవారు. ప్రస్తుతం ఎకరం విస్తీర్ణంలో నాటు వేయడానికి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నారు.  కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి, అవసరమైతే ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మహిళా కూలీలను ట్రాలీల ద్వారా తరలిస్తున్నారు.  కూలీలకు రైతులే  భోజన సదుపాయం, దావత్​లు ఇవ్వాల్సి వస్తోంది. మహబూబాబాద్​ జిల్లా నుంచి సమీపంలోని సూర్యాపేట , ఖమ్మం జిల్లాలకు కూలీ పనులకు పోవడంతో స్థానికంగా కూలీలకు ఫుల్​ డిమాండ్​ ఉంది.

మగ కూలీల రేట్లు జంప్​ 
వానా కాలం సీజన్ లో  మగ కూలీలకు సైతం డిమాండ్ అధికంగానే ఉంది.  గతంలో మగ కూలీకి వ్యవసాయ పనులకు రోజుకు రూ.500 చెల్లించేవారు.  ప్రస్తుతం వానాకాలంలో  వరాలు(ఒడ్లు) చెక్కడం, నారు మోయడం, గొర్రు తోలడం కోసం మగ కూలీకి రోజుకు రూ.800 నుంచి 900 చొప్పున చెల్లిస్తున్నారు. అదనంగా సాయంత్రం దావత్​కు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

యూపీ కూలీలవైపు చూపు.. 
వరి ఎక్కువగా సాగు చేసే ఉమ్మడి కరీంనగర్, వరంగల్​, నిజామాబాద్​, మెదక్, నల్లగొండ​ తదితర జిల్లాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. గతంలో యూపీ,  బిహార్​ నుంచి వచ్చిన మగ కూలీలతో కూడా  కొందరు పెద్ద రైతులు నాట్లు వేయించారు.  ప్రస్తుతం కూలీల కొరత రావడంతో  యూపీ, బిహార్​ కూలీలను ఫోన్ల ద్వారా రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఎకరానికి రూ.5వేలతో పాటు తిండి​ కూడా పెడ్తామని, ప్రయాణ ఖర్చులు కూడా భరిస్తామని ఆఫర్​ ఇస్తున్నట్లు తెలిసింది. 

కూలీ డబ్బులు  ముందే  చెల్లిస్తున్నారు
 గతంలో ఎవుసం పనులు చేసినంక  రైతులు కూలీ పైసలు ఇచ్చేవారు.  ప్రస్తుతం కూలీలకు ఫుల్​ డిమాండ్​ ఉండడంతో మగ కూలీలకు రోజుకు  రూ. 800 ముందే ఇస్తున్నారు. కొంత మంది దావతులు ఏర్పాటు చేస్తున్నారు.  పనుల  సీజన్ లోనే  కదా  నాలుగు పైసలు దొరికేది.

‌‌‌‌‌‌‌‌ -గుగుతు మన్నా, వసరామ్​ తండా, నెల్లికుదురు, మహబూబాబాద్

పెట్టుబడుల భారం తగ్గేలా చూడాలి..
రాష్ట్ర ప్రభుత్వం కేవలం రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది. రైతులు దుక్కులు దున్నడం, గొర్రు తోలడం, వరాలు చెక్కడం, వరి నాట్లు వేయడానికి, కలుపు తీయడం, ఎరువులు  చల్లడం తదితర పనులకు కూలీల రేట్లు బాగా పెరిగినయ్​.  ఎవుసం పనులకు ‘ఉపాధి హామీ’ పథకాన్ని అనుసంధానించాలి. బ్యాంకు రుణాలను మాఫీ చేయడంతో పాటు ,  కొత్త రుణాలను అందించి రైతులకు తగిన తోడ్పాటు అందించాలి. రైతులపై పెట్టుబడి భారం తగ్గేలా చూడాలి.
-  కందాడి అశోక్​ రెడ్డి, రైతు, కొత్తగూడెం