న్యూఢిల్లీ: కొత్త లేబర్ కోడ్స్ అమలు వల్ల ఉద్యోగుల టేక్-హోమ్ జీతం తగ్గుతుందన్న ప్రచారంలో నిజం లేదని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జీతంలో బేసిక్‌పే 50 శాతానికి మించితే కోత పడుతుందంటూ వార్తలు రావడంతో ఈ వివరణ ఇచ్చింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లింపులను చట్టబద్ధమైన వేతన పరిమితి (స్టాట్యూటరీ వేజ్ సీలింగ్)పై లెక్కించినంత కాలం టేక్-హోమ్ జీతంపై ఎటువంటి ప్రభావమూ ఉండదని పేర్కొంది.
కొత్త కోడ్‌ల కింద పీఎఫ్ తగ్గింపు రూ.15 వేల వేతన పరిమితి ఆధారంగానే ఉంటుంది. కావాలంటే దీనిని ఉద్యోగులు పెంచుకోవచ్చు. తప్పనిసరి ఏమీ కాదు. ఈ లిమిట్కంటే పీఎఫ్ చెల్లింపు ఉంటేనే టేక్‌హోం జీతం తగ్గుతుంది. ప్రస్తుతం రూ.15 వేల చట్టబద్ధమైన వేతన పరిమితిలో 12 శాతం (రూ.1,800) పీఎఫ్ చెల్లించే వారికి జీతంలో మార్పు ఉండదు.
ఉదాహరణకు మొత్తం జీతం రూ.60 వేలు ఉన్నవాళ్లకు, పీఎఫ్ లెక్కించడానికి నోషనల్ వేజ్ రూ.30 వేలు. అయినప్పటికీ, పీఎఫ్‌ను రూ.15 వేలపై మాత్రమే లెక్కిస్తారు కాబట్టి ఉద్యోగికి గతంలో మాదిరే టేక్-హోమ్ జీతం రూ.56,400 వస్తుంది. ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ ఎప్పట్లానే రూ.1,800 ఉంటుంది. ఈ రూ.15 వేల పరిమితిని కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్త వేతనం ప్రస్తుత బేసిక్ పే కంటే ఎక్కువగా ఉంటే, గ్రాట్యుటీ కోసం యజమాని జీతంలో కోత విధించడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ సమయంలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌కు అనుమతించినా నెట్ టేక్ హోమ్ జీతంపై ప్రభావం చూపవచ్చు.

