లాక్‌డౌన్ పొడిగింపుతో సొంతూళ్ల బాటబట్టిన వలసజీవులు

లాక్‌డౌన్ పొడిగింపుతో సొంతూళ్ల బాటబట్టిన వలసజీవులు

లాక్‌డౌన్‌తో సిటీలో చాలా మందికి పని కరువైంది. ఇంకొన్ని రోజులు లాక్‌డౌన్ పొడిగించడంతో వృత్తి, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన వారు సొంత ఊర్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు పరిమితంగానే ఉండడంతో సొంత వాహనాలతో పాటు ప్రైవేట్ వెహికిల్స్‌లో సొంతూళ్లకు వెళ్తున్నారు. సిటీలో పనులు లేకపోవడంతో.. సొంతూళ్లో ఏదో ఒక పని చేసుకొని అయినవాళ్లతో కలిసి బతుకుదామని వలసజీవులు నిర్ణయించుకుంటున్నారు. దాంతో సిటీ ఔట్‌స్కర్ట్స్ మొత్తం వాహనాలు, జనాలతో కిక్కిరిసిపోయాయి.

రాష్ట్రంలో 8వ రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఉదయం 10 గంటల తర్వాత అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తున్నారు. ఇక లాక్‌డౌన్ సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి  10 గంటల వరకు ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొంటున్నారు. దీంతో మార్కెట్లు, కిరాణ షాపుల దగ్గర రద్దీ కనిపిస్తోంది. జనం ఒక్కసారిగా రోడ్ల మీదకు రావడంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాంలు ఏర్పడుతున్నాయి. 

మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12నుంచి అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్.. శుక్రవారం ఉదయం ముగుస్తుండటంతో.. మంత్రులతో చర్చించి లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కేబినెట్ మంత్రులకు ఫోన్ చేసి.. అభిప్రాయాలు తీసుకున్న సీఎం.. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగించారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల చేయాలని CSను ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాలు, వైద్య సేవల పర్యవేక్షణలో మంత్రులు బిజీగా ఉన్నందున రేపు జరగాల్సిన కేబినెట్ మీటింగ్‌ను సీఎం రద్దు చేశారు.