
ముందుకుసాగని వరినాట్లు, కలుపుతీత పనులు
రాష్ట్రంలో వ్యవసాయ కూలీలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈసారి వర్షాలు లేట్ కావడం.. గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లోకి వరద ఆలస్యంగా రావడం, కాలువ నీరు కూడా ఇప్పుడిప్పుడే వస్తుండడంతో వివిధ జిల్లాల్లో వరినాట్లు మొదలయ్యాయి. కానీ సరిపడా కూలీలు దొరక్క పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని రైతులు అంటున్నారు. బోర్ల కింద ముందుగా నాట్లు వేసిన పొలాల్లో కలుపు విపరీతంగా పెరిగినా సకాలంలో తొలగించలేకపోతున్నారు. ఇది వరి ఎదుగుదలపై ఎఫెక్ట్ చూపుతోంది. కలుపు తీస్తే గానీ మొదటి విడత యూరియా చల్లే పరిస్థితి లేదు. కలుపు తీద్దామంటే కూలీలు దొరకడంలేదు.
ఎందుకీ సమస్య
ప్రస్తుత కూలీల కొరతకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో వ్యవసాయ కూలీలకు వేసవిలో ఒకటి, రెండునెలలు తప్ప మిగిలిన రోజుల్లో చేతి నిండా పని ఉండేది. కానీ వ్యవసాయ రంగంలో వివిధ మిషిన్ల కారణంగా కూలీలకు పనిదినాలు తగ్గిపోయాయి. ట్రాక్టర్ల రాకతో దున్నడాలు, హార్వెస్టర్ల వల్ల పంట కోతలు, నూర్పిళ్లు నిలిచిపోయాయి. పత్తి, తదితర మెట్టపంటల్లో కలుపు నివారణ మందుల వాడకం, వివిధ మిషిన్ల వినియోగం వల్ల కలుపుతీత పనులు తగ్గిపోతున్నాయి. దీంతో పల్లెల్లో భూమిలేని పేదలు పూర్తిగా వ్యవసాయరంగంపై ఆధారపడి బతికే పరిస్థితి లేకుండా పోయింది.
ఈ క్రమంలో పట్టణాల్లో నిర్మాణ రంగం పనుల్లో చాలా మంది అడ్డాకూలీలుగా మారిపోతున్నారు. వలసవెళ్లి అక్కడే ఉండడమో, ఊళ్ల నుంచి వెళ్లి రావడమో చేస్తున్నారు. అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద సుమారు కోటీ 15లక్షల మంది కూలీలుగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వాస్తవానికి వీరిలో సగానికిపైగా రైతు కుటుంబాలకు చెందిన వారే. తమ పొలం పనులు ముగిశాక ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఉపాధిహామీ పనులకు వెళ్తుంటారు. మెట్ట పంటల్లో మిషిన్ల వాడకం పెరిగినా.. వరిలో నాటు, కలుపు మిషిన్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావడం లేదు. కొన్నిచోట్ల వాడేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా సక్సెస్ కావడం లేదు. దీంతో యాసంగి, వానకాలం సీజన్లో వరి నాట్లు, కలుపుల కోసం పెద్దసంఖ్యలో కూలీలు అవసరమవుతున్నారు. యాసంగిలో అంత సమస్య లేకున్నా వానకాలంలో ప్రధానంగా జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూలీలకు, అందులోనూ మహిళా కూలీలకు చాలా డిమాండ్ ఉంటుంది.
ఒక్కో కూలీకి రూ. 500పైనే..
వ్యవసాయ పనుల సీజన్ కావడంతో అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను దాదాపు నిలిపివేశారు. నిజానికి ఉపాధిహామీ పథకంలో భాగంగా కూలీలకు కనీస కూలి కింద రోజుకు రూ. 180 చెల్లిస్తున్నారు. నిర్మాణ రంగంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రూ. 300, పురుషులకు రూ. 500 దాకా ఇస్తున్నారు. ప్రస్తుత డిమాండ్‌ను బట్టి కొందరు రైతులు కూలీలకు రూ. 500 నుంచి 750 దాకా చెల్లించేందుకు ముందుకు వస్తున్నప్పటికీ దొరకడం లేదు. దీంతో వరినాట్లు, కలుపుతీత పనులు ముందుకు సాగడంలేదు. ఇదే అవకాశంగా కొందరు కూలీలు గుత్త నాట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మహబూబ్ నగర్లాంటి జిల్లాల్లో ఎకరా పొలం నాటు వేసేందుకు రూ. 3 వేలు, మంచిర్యాల, వరంగల్, ఖమ్మంలాంటి జిల్లాల్లో రూ. 4,500 దాకా తీసుకుంటున్నారు. ఒక్క ఎకరా నాటు వేసేందుకు సుమారు ఆరుగురు కూలీలు అవసరమవుతారు. గుత్త నాట్ల లెక్కన చూసుకుంటే.. ఒక్కొక్కరికి రూ. 500 నుంచి రూ. 750 దాకా గిట్టుబాటవుతోంది. ఇంత మొత్తం కూలీగా చెల్లించే స్థోమత లేని చిన్న, సన్నకారు రైతులు చేబదులు పనులకు వెళ్తున్నారు. అంటే మూడు, నాలుగు రైతు కుటుంబాల్లోని మహిళలంతా కలిసి ఒకరి పొలం తర్వాత మరొకరి పొలం నాటేసుకుంటున్నారు. అది కూడా సాధ్యం కాని వారు రోజుకు కొంత భాగం చొప్పున వారం పాటు కుటుంబసభ్యులే నాట్లు వేసుకోవడం చాలాచోట్ల కనిపిస్తోంది.
కూలీలు దొరుకుత లేరు
పొలాన్ని పది రోజుల కింద నాటుకు సిద్ధంచేసిన. కానీ సమయానికి కూలీలు దొరకలేదు. ఈలోగా పెద్దవాన పడి రెండెకరాల పొలం నాటుకు అక్కరకు రాకుండా పోయింది. మడులు తెగిపోయినయి. మళ్లీ ట్రాక్టర్‌తో దున్ని నాటుకు సిద్ధం చేస్తున్నం. లోకల్‌గా కూలీలు దొరక్క పక్క జిల్లా నుంచి తీసుకువస్తున్నం. పెరిగిన కూలీల ఖర్చులతో ఎకరా నాటు వేయడానికి పది వేలదాకా అయితున్నది.
– పోలు సుభాష్, రావులపల్లె (టి), రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా
ఉన్న కొద్దిమందికి డిమాండ్
చాలామంది పొలం పనులు చేసేందుకు ముందుకు వస్తలేరు. ఒకేసారి నాట్ల పనులు రావడంతో ఉన్న కొద్ది మంది కూలీలకు డిమాండ్ ఉంది. వారు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తోంది. మాదగ్గర నిన్నమొన్నటి దాకా రూ. 250 ఉండే కూలి ఒక్కసారి రూ. 450కి చేరింది.
– మల్లేష్, వదలపర్తి, కామారెడ్డి జిల్లా