రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నిధుల కొరత

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో నిధుల కొరత
  • 32 వేల బ్యాంక్ ఖాతాలను క్లోజ్ చేసిన విద్యాశాఖ
  • వాటిలోని రూ.100 కోట్లకు పైగా ఫండ్స్ వెనక్కి తీసుకున్న సర్కారు
  • స్కూళ్లు తెరుచుకున్నా పైసా ఇయ్యలె.. సొంత డబ్బు ఖర్చు చేస్తున్న హెడ్‌‌మాస్టర్లు

హైదరాబాద్, వెలుగు: నిధుల్లేక సర్కారు బడులు విలవిల్లాడుతున్నాయి. విద్యా సంవత్సరం ముగిసే సమయంలో స్కూళ్ల బ్యాంక్ ఖాతాల్లోని 
పైసలన్నీ వెనక్కి తీసుకున్న విద్యా శాఖ అధికారులు, స్కూళ్లు రీఓపెన్ అయినా ఒక్క పైసా వెనక్కి ఇవ్వలేదు. దీంతో బడుల నిర్వహణ కష్టంగా మారింది. కనీసం చాక్ పీస్‌‌లు, రిజిస్టర్లకూ నిధుల్లేకపోవడంతో హెడ్‌‌మాస్టర్లు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. సర్కారు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

తిరిగి ఇవ్వరట
రాష్ట్రంలో 24,852 సర్కారు స్కూళ్లు, 467 మండల రీసోర్స్ సెంటర్లు(ఎంఆర్సీ), 1,817 స్కూల్ కాంప్లెక్స్‌‌లకు సర్కారు ఏటా మెయింటెనెన్స్ గ్రాంట్స్ రిలీజ్ చేస్తుంది. ఒక్కో ఎంఆర్సీకి ఏటా రూ.90 వేలు, ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌‌కు రూ.33 వేలు ఇస్తుంటారు. స్కూళ్లలో సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష దాకా అందిస్తున్నారు. రెండేండ్ల నుంచి కరోనా పేరుతో నిధులు సక్రమంగా ఇవ్వడంలేదు. 2020–21లో స్కూళ్లు, ఎంఆర్సీలు, కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లకు నిధులు సగమే ఇచ్చారు. 2021–22లో ఎంఆర్సీలు, స్కూల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లకు ముందుగా సగం ఇచ్చి, ఆర్థిక సంవత్సరం ముగిసే రోజు మార్చి31న మిగలిన సగం నిధులిచ్చారు. ఖర్చు చేసుకునేందుకు టైమ్ కూడా ఇవ్వలే.

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో సింగిల్ నోడల్ ఏజెన్సీపేరుతో ప్రస్తుతం అన్ని రకాల బ్యాంకుల్లోని 32 వేల ఖాతాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మూసివేశారు. వాటిలో ఉన్న నిధులన్నీ తీసేసుకున్నారు. 2021–22 కంటే ముందువి స్కూల్ క్లాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌ల ఖాతాల్లో రెండు కోట్లు, ఎంఆర్సీల్లో రూ. 80 లక్షలు, స్కూళ్లలో రూ.75 కోట్ల నిధులు ఉన్నాయి. వీటితోపాటు 2021–22లోని నిధులు కలిపి సుమారు రూ.వంద కోట్లకు పైనే అధికారులు వెనక్కి తీసుకున్నారు. గతంలోనూ ఇలాగే తీసుకుని ఇవ్వలేదని, ఇప్పుడూ తిరిగి ఇవ్వబోమని అధికారులు చెబుతున్నారు. కొత్తగా కెనరా బ్యాంకుల్లో ఖాతాలు తీసినా, వాటిలోనూ నిధులు వేయలేదు.

సొంతంగా ఖర్చు చేస్తున్నరు

ఈనెల 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ప్రారంభమైంది. 13న స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. అప్పటికి సర్కారు బడుల్లో ఒక్క పైసా కూడా లేదు. బడిబాట కరపత్రాలు, బ్యానర్లను స్కూళ్లు ప్రింట్ చేయించుకునేందుకు నిధులు రిలీజ్ చేయలేదు. పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపయోగపడే చాక్​పీసులు కొందామన్నా ఫండ్స్ లేవు. బడుల ప్రారంభం రోజే చాక్​పీసులు, రిజిస్టర్లు, టీచర్ల డైరీలను హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్లు కొన్నారు. ఈ మధ్య కరోనా కేసులు పెరుగుతుండటంతో శానిటైజేషన్ మెటీరియల్ కూడా చాలా బడుల్లో తీసుకున్నారు. తొలిరోజు పండుగ వాతావరణంలో బడులు తెరువాలని ఆదేశాలివ్వడంతో పిల్లలకు స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. వీటన్నింటికీ హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్లు, కొంతమంది టీచర్లు తమ సొంత డబ్బులు ఖర్చు చేశారు. అప్పులు చేసి ఖర్చులు పెడుతున్నారు. ఇంకా ఇంటర్నెట్ బిల్లు, కరెంట్ బిల్లుతోపాటు మైనర్ రిపేర్లూ చేయాల్సి ఉందని, వాటికీ డబ్బులు ఇవ్వకపోతే ఎలా అని పలువురు హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్లు ప్రశ్నిస్తున్నారు. బడుల్లో ఏ పనిచేయాలన్నా, ఏ వస్తువు కొనాలన్నా హెడ్‌‌‌‌‌‌‌‌మాస్టర్లే సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ‘మనఊరు మనబడి’ కింద ఎంపికైన స్కూళ్లలో కొన్ని పనులు మొదలైనా, మిగిలిన బడులను అసలే పట్టించుకోవడంలేదని టీచర్లు విమర్శిస్తున్నారు.