మహిళ నోట్లో నోరు పెట్టి శ్వాస

మహిళ నోట్లో నోరు పెట్టి శ్వాస

హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్రికెట్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ నేపథ్యంలో గేట్లు ఓపెన్ చెయ్యగానే క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో జింఖానా మైదానంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి, స్పృహ కోల్పోయింది. ఆ మహిళ ప్రాణాలు రక్షించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో లేడీ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నవీన.. తన నోటి ద్వారా రజితకు శ్వాస అందిస్తూ విశ్వప్రయత్నం చేసింది. సీపీఆర్ కూడా అందించింది. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ తొక్కిసలాటలో చాలా మందికి కాళ్లు, చేతులు విరిగినట్లు తెలుస్తోంది. 

జింఖానా గ్రౌండ్  లో జరిగిన తొక్కిసలాటలో మొత్తం 20మంది గాయపడ్డారని అధికారులు చెప్తున్నారు. పోలీసులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య జరిగిన తోపులాటలో చాలా మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. గాయపడిన వారిని యశోద హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయినట్లు వస్తోన్న వార్తలపై  అడిషనల్ కమిషనర్ చౌహన్ స్పందించారు. ఆ మహిళ చనిపోలేదని, యశోదలో చికిత్స పొందుతోందని స్పష్టం చేశారు.