- నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టించి ముంచిన కి‘లేడీ’
- లాభాలు చూపించి విత్‌డ్రాకు నో చాన్స్
- యూఏఈకి ట్యాక్స్ అంటూ దశల వారీగా దోపిడీ
- ఫ్రెండ్స్ నుంచి అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి కట్టిన బాధితులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: సోషల్ మీడియాలో ఓ సాఫ్ట్వేర్ఇంజినీర్కి హాయ్చెప్పి పరిచయం పెంచుకున్న ఓ మహిళ మాయమాటలతో నకిలీ ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టించి రూ. 2.14 కోట్లు దోచుకుంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం...టీఎన్‌జీవో కాలనీకి చెందిన ఓ టెకీకి డిసెంబర్లో ఫేస్‌బుక్‌ద్వారా ఓ మహిళ పరిచయమైంది. ఆమె తాను స్టాక్ ట్రేడింగ్‌లో భారీ లాభాలు గడిస్తున్నట్లు చెప్పింది. ఆమె మాటలు నమ్మిన బాధితుడు ఆమె సూచన మేరకు ఓ నకిలీ ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాడు.
డిసెంబర్ 12న రూ.31.5 లక్షలు పెట్టుబడి పెట్టగా, యాప్‌లో భారీ లాభాలు కనిపించాయి. ఇంకా పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పడంతో రెండోసారి రూ.42.27 లక్షలు బదిలీ చేశాడు. లాభాలను విత్‌డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా, 30 శాతం పన్ను యూఏఈ ప్రభుత్వానికి కట్టాలని మోసగాళ్లు కొత్త మెలిక పెట్టారు. యాప్‌లో కనిపిస్తున్న వర్చువల్ లాభాలను నిజమని నమ్మిన బాధితుడు... ఆఫీసు సహోద్యోగుల నుంచి రూ. 90 లక్షలు అప్పు తీసుకున్నాడు.
కుటుంబసభ్యుల నుంచి డబ్బు సేకరించి, కొన్ని ఆస్తులను కూడా అమ్మి మొత్తం 8 విడతల్లో రూ. 2.14 కోట్లు మోసగాళ్లకు ట్రాన్స్ఫర్చేశాడు. చివరకు విత్‌డ్రా కోసం ప్రయత్నించగా, అదనంగా రూ. 68 లక్షలు కట్టాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించాడు. వెంటనే అప్రమత్తమై, ఆ మహిళ ఫొటోను ఇంటర్నెట్‌లో వెతికి చూడగా, అది ఇన్‌స్టాగ్రామ్‌లో వేరొకరి ప్రొఫైల్ నుంచి దొంగిలించినదని తేలింది. నకిలీ ప్రొఫైల్‌తో మోసపోయానని నిర్ధారించుకున్న బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
