
- వర్షాలు లేక దొరకని పనులు
- దూర ప్రాంతాలకు వెళ్తున్న కూలీలు, చిన్న రైతులు
- నిజామాబాద్ జిల్లాలో పలు పల్లెల్లో దుర్భర స్థితి
వీరు నిజామాబాద్ జిల్లా పిట్లం మండలం కారేగాం తండా వాసులు. 80 కుటుంబాల ఈ తండాలో ఎక్కువమంది ఎకరం రెండెకరాల చిన్న రైతులే. వ్యవసాయంతో పాటు కూలీనాలి చేసుకుంటేనే కుటుంబం గడిచేది. వానకాలం స్టార్ట్ అయి నెలన్నర దాటుతున్న సరైన వర్షాలు లేవు. కొద్ది మంది మినహా చాలా వరకు విత్తుకూడా వేయలేదు. ఇక్కడ పనులు లేక తండా నుంచి నిత్యం 60 మందికి పైగా రూ.250, రూ.300 కూలీ కోసం 80 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డి జిల్లా కౌడిపల్లికి వెళ్లి వస్తున్నరు. పొద్దున 7 గంటలకు బయల్దేరితే మళ్లీ వచ్చే వరకు రాత్రి 10 గంటలైతుంది. జిల్లాలో చాలా చోట్ల ఉపాధి కోసం ఇలా దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుర్భర స్థితి నెలకొంది.
పిట్లం, వెలుగు: ఖరీఫ్ ప్రారంభమై చాలా రోజులవుతున్నా వర్షాలు లేక నిజామాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వ్యవసాయ పనులు లేక కూలీతోపాటు సన్న చిన్నకారు రైతులు కూడా ఉపాధి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. పిట్ల మండలంలో పరిస్థితి మరీ దుర్భరంగా మారుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్కజొన్న వేశారు. వర్షాభావం, ఎండల తీవ్రతకు పంటలు పండే పరిస్థితి కనిపిస్తలేదు.
కారేగాం తండాలో సుమారు 400 జనాభా ఉంటుంది. 240 ఎకరాల వరకు సాగుభూమి ఉంది. తండా నుంచి రోజూ దాదాపు 60 మంది మినీలారీలో 80 కిలోమీటర్ల దూరంలోని సంగారెడ్డి జిల్లా కౌడిపల్లి మండలానికి వెళ్లొస్తున్నరు. అంతదూరం వెళ్లినా మగవారికి రూ.300 , ఆడవారికి రూ.250 కూలీ ఇస్తున్నరు. మిగిలిన వారు ఆటోల్లో ఇతర ప్రాంతాలకు వెళుతున్నరు. ప్రతి రోజు ఉదయం దళారీ లారీని తీసుకుని రాగా ఏడు గంటలకు బయలు దేరివె పనిచేసి రావడానికి రాత్రి పది గంటలు పడుతుంది. ఉదయం ఐదు గంటలకే లేచి ఇంటి పనులు చేసుకొని వెళ్తున్నమని.. అక్కడ వరినాట్లు వేస్తున్నామని కూలీలు తెలిపారు.
నిర్మానుష్యంగా కనిపిస్తున్న తండా..
ఎక్కువ మంది కూలీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుండటంతో వృద్ధులు, చిన్న పిల్లలు మినహా తండాలో ఎవరూ కనిపించడం లేదు. మధ్యాహ్నం అయితే మొత్తం నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల కల్లా పెద్దలు పనికి, పిల్లలు స్కూల్‌కు పోతున్నరు. పరిస్థితి ఇలాగే ఉంటే మరి కొద్ది రోజుల్లో తాగునీటికి కూడా ఇబ్బంది తప్పదని ఆందోళన చెందుతున్నారు. మండలంలోని చాల్లా పల్లెలే దాదాపు ఇదే పరిస్థితి.
దూరమైనా వెళుతున్నాం
మొక్కజొన్న పంట వేసినా వానలు లేక ఎండిపోతోంది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మండలంలో అందరికి పని దొరకడం లేదు. గత్యంతరం లేక చాలా దూరమైనా వరి నాట్లు వేయడానికి వెళుతున్నాం. – తావుర్యా నాయక్, కారేగాం తండా
ఉదయం వెళితే రాత్రికి రాక
రోజు ఉదయం ఏడు గంటలకే అన్ని పనులు చేసుకుని వెళితే రావడానికి రాత్రి పది అవుతోంది. మళ్లీ ఉదయం ఐదింటికే లేచి అన్ని సిద్ధం చేసుకొని ఉరుకులు, పరుగులతో పనికి వెళ్లాలి. వర్షాలు కురవక సాగు నీరు లేక మాకు పంటలు పండటం కష్టంగా మారింది. – జిజియా బాయి, కారేగాం తండా