రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత

రాష్ట్రంలో లక్ష టన్నుల యూరియా కొరత

మార్క్ ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ 16 వేల టన్నులే
సిద్దిపేట, వికారాబాద్‌, రంగారెడ్డి మార్క్ ఫెడ్‌లో నిల్వలు జీరో
25 జిల్లాల్లోని కంపెనీ గోదాముల్లో నో స్టాక్
యూరియా దొరక్క రైతుల పాట్లు

ఈ నెల కోటా 2.56 లక్షల టన్నులు..

ట్రాన్సిట్‌ వద్దకు చేరింది 1.47 లక్షల టన్నులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడింది. ఇటీవల వర్షాలతో పంటలు నీట మునిగాయి. దెబ్బతిన్న పంటలకు యూరియా చల్లితే తిరిగి కోలుకుంటాయన్నఆశతో రైతులు ఉన్నారు. కానీ డిమాండ్‌కు తగినంత స్టాక్‌ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటల  సాగు భారీగా పెరగడంతో ఆగస్టు నెల వర్షాల దెబ్బకు 10 లక్షల ఎకరాలకుపైగా పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. వరి ఎదగపోవడం, పత్తి దెబ్బతినడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు యూరియా చల్లుతున్నారు. దీంతో యూరియా వాడకం పెరిగింది. ఉన్న నిల్వలు చాలక లక్ష టన్నులకుపైగా యూరియా కొరత ఏర్పడుతోంది. 

రైతన్నల బారులు

ఈ సీజన్‌లో యూరియా కేటాయింపులు 10.50 లక్షల టన్నులు కాగా ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 5.77 లక్షల టన్నులు సరఫరా జరిగింది. ఈ నెలలో కేంద్రం కేటాయించిన యూరియా 2.56 లక్షల టన్నులు రావాల్సి ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 1.47 లక్షల టన్నులు యూరియా ట్రాన్సిట్‌ కేంద్రాల నుంచి ఇంకా చేరలేదు. యూరియా అమ్మకాలు జోరందు కోవడంతో ఇప్పడున్న నిల్వలు ఏమాత్రం సరిపోక కొరత ఏర్పడుతోంది. కొన్ని జిల్లాల్లో మార్క్ ఫెడ్‌, సహకార సంఘాల వద్ద స్టాక్‌ లేక పోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. సిద్ధిపేట, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో సమస్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో యూరియా కొనుగోళ్ల కోసం రైతులు బారులు తీరుతున్నారు.

స్టాక్‌ 69 వేల టన్నులే

రాష్ట్రంలో 69 వేల టన్నుల యూరియా మాత్రమే స్టాక్‌ ఉన్నది. గత ఏడాది ఆగస్టులో 1.62 లక్షల టన్నుల స్టాక్‌ ఉండగా ఈ ఏడు అంతకంటే తగ్గింది. ఈ ఆగస్టు నెలాఖరు వరకు కంపెనీల వద్ద యూరియా నిల్వలు 854 టన్నులు ఉండగా, డీలర్ల దగ్గర 29 వేల టన్నులు, సొసైటీల వద్ద 23 వేల టన్నులు ఉన్నది. మార్క్ఫెడ్ వద్ద 16 వేల టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి

మార్క్ఫెడ్ లో 16 వేల టన్నులే

మార్క్ ఫెడ్‌ వద్ద నిల్వలు ఎక్కువగా ఉండాలి. కానీ 16 వేల టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. సిద్ధిపేట, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మార్క్ ఫెడ్‌ వద్ద యూరియా నిల్వలే లేవు. నిజామాబాద్‌లో 5, నిర్మల్‌లో 12, సంగారెడ్డిలో 27,  కామారెడ్డిలో 62, మెదక్‌లో 98 టన్నులు మాత్రమే మార్క్ ఫెడ్‌ వద్ద ఉన్నాయి. సహకార సంఘాల్లో చూస్తే.. నారాయణపేట్ లో 35, మల్కాజిగిరిలో 54, కామారెడ్డిలో 7 టన్నులు మాత్రమే ఉన్నాయి. డీలర్ల వద్ద ఉన్న నిల్వల్లో అత్యల్పంగా నిర్మల్‌ జిల్లాలో 11 టన్నులే ఉండడం గమనార్హం.

కంపెనీ గోదాముల్లో నో స్టాక్

రాష్ట్రంలోని 32 జిల్లాల్లో పంటలు సాగువుతుండగా 25 జిల్లాల్లోని కంపెనీ గోదాముల్లో యూరియా స్టాక్ లేదు. మిగతా 7 జిల్లాల్లో మొత్తం 854 టన్నుల యూరియా మాత్రమే ఉంది. కరీంనగర్‌లో 108,  మంచిర్యాలలో 75,  నల్గొండలో 80,  గద్వాలలో 154, నిజామాబాద్‌లో 285, ఆదిలాబాద్‌లో 21, మల్కాజిగిరి జిల్లాలో 131 టన్నులు ఇలా మొత్తంగా  854 టన్నుల స్టాక్ ఉంది.

ట్రాన్సిట్‌ నుంచి ఇంకా రాలే 

రాష్ట్రానికి వైజాగ్‌, మంగళూరు, కృష్ణపట్నం, కాకినాడ,  జైగఢ్‌, గోవా, గంగవరం, సూరత్‌, థాల్‌ పోర్టులు, పోర్ట్ ల్యాండ్‌ల నుంచి యారియా రావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో లోడింగ్‌ దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల నుంచి  రైళ్లద్వారా రవాణా అవుతోంది. ఎన్‌ఎఫ్‌సీఎల్‌, ఐపీఎల్‌, సీఐల్‌, ఇఫ్‌కో,  క్రిబ్‌కో, ఆర్‌సీఎఫ్‌, నర్మద, జయురీ కంపెనీలకు చెందిన యూరియా లోడింగ్‌ దశలో ఉన్నది. ఈ యూరియా త్వరలో వస్తుందని అధికారులు చెప్తున్నారు.

5 లక్షల టన్నులు ఎక్కువ వాడకం 

నిరుడు ఈ టైమ్కు 94 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే ఈ ఏడు 32 లక్షల ఎకరాలు ఎక్కువగా 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. దీంతో యూరియా, డీఏపీ, నత్రజని, బాస్వరం, జింక్ తదితర ఎరువులకు నిరుడి కంటే ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. దీనికి తోడు 47 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. నిరుడు ఇదే టైమ్కు 23 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఈ యేడు 24 లక్షల ఎకరాల్లో ఎక్కువగా వరి సాగవడంతో.. గతేడాది కంటే 5 లక్షల టన్నుల వరకు ఎక్కువగా యూరియా వాడినట్లు తెలుస్తోంది.

10 రోజుల నుంచి తిరుగుతున్న

నేను 6 ఎకరాల్లో వరి వేశాను. యూరియా కోసం పది రోజులుగా తిరుగుతున్నా దొరుకుత లేదు. టైమ్ కు యూరియా వేయనందుకు పంట మంచిగ ఎదుగుతలేదు. యూరియా కోసం రోజూ గజ్వేల్‌‌ కు పరుగులు పెట్టాల్సి వస్తోంది. వచ్చిన స్టాక్‌‌ అందరికీ పంపిణీ చేయాలని ఒకట్రెండు బస్తాలే ఇస్తున్నారు.

– కొల్గూరు వెంకట్‌‌, రైతు, వేలూరు, సిద్దిపేట జిల్లా

For More News..

హైదరాబాద్‌‌‌‌లో సాదాసీదాగా నిమజ్జనం

త్వరలో లొంగిపోనున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు

రైతు ఆత్మహత్యల్లో ఐదో స్థానంలో రాష్ట్రం