హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలో పక్షి ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్, ఇండియన్ బర్డ్స్ జర్నల్ సీనియర్ ఎడిటర్ ఆశిష్ పిట్టి తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కళ పత్రిక, జయహో పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎ.మంగ రచన రేఖా చిత్రాలతో రూపొందించిన బర్డ్ వాచర్ జర్నల్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఆర్నిథాలజిస్ట్ ఆశిష్ పిట్టి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సిటీలో వీకెండ్అయితే, ఎంతోమంది బర్డ్ వాచింగ్ కోసం ఆసక్తిగా చెరువులు, పార్కులు, అడవుల బాట పడుతున్నారన్నారు.
ఇందులో ఎక్కువ శాతం యువతరం ఉండటం సంతోషకరమన్నారు. కళ పత్రిక ఎడిటర్డాక్టర్ మహ్మద్ రఫీ మాట్లాడుతూ సరళమైన తెలుగులో, చక్కటి బొమ్మలతో హైదరాబాద్ లోని అందమైన, అరుదైన పక్షుల విశేషాలతో పుస్తకం తీసుకువచ్చిన రచయిత్రి మంగను అభినందించారు.
రచయిత్రి డాక్టర్ మంగ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ తరువాత తాను సరదాగా తీసిన ఫొటోకి చిక్కిన తేనె పిట్ట..తనకు పక్షులపై విపరీతమైన ఆసక్తిని పెంచి అభిరుచిగా మార్చిందన్నారు. సినీ దర్శకుడు శివ నాగేశ్వరరావు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య పుస్తకాన్ని సమీక్షించారు.
