సూపర్‌‌‌‌ మామ్స్‌‌లో బామ్మ

సూపర్‌‌‌‌ మామ్స్‌‌లో బామ్మ

కొందరికి మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది. ఇంకొందరికి డాన్స్‌‌ మీద ఇంట్రెస్ట్‌‌ ఉంటుంది. వాటితో లైఫ్‌‌లో పైకి రావాలని కోరుకుంటారు. కానీ, పేరెంట్స్‌‌, పెండ్లి, సొసైటీ ఇలా ఏదో ఒక కారణంతో వాటిని వదులుకున్నవాళ్లూ ఉంటారు. అలాంటి వాళ్లకోసమే జీ టీవీ ‘ డాన్స్‌‌ ఇండియా డాన్స్‌‌ సూపర్‌‌‌‌ మామ్స్‌‌’ తీసుకొచ్చింది. అయితే, ఈ షో ఆడిషన్స్‌‌కి వచ్చిన 76 ఏళ్ల లక్ష్మి టతోడ్కర్‌‌‌‌ డాన్స్‌‌, ఎనర్జీ చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు.

పెండ్లైన నాలుగేండ్లకే తాగుడుకు బానిసైన భర్త లక్ష్మిని వదిలేశాడు. ఒంటరిగా ఉంటున్న లక్ష్మిని ఆదుకున్నాడు అన్న. అప్పటినుంచి అన్న ఇంట్లోనే ఉంటుంది. లాక్‌‌డౌన్‌‌ టైంలో మనుమలు, మనవరాండ్లతో కలిసి టిక్‌‌టాక్, ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో డాన్స్‌‌ వీడియోలు చేస్తుండేది. ఆ వీడియోలు బాగా వైరల్‌‌ అయ్యాయి. వాటిని చూసినవాళ్లంతా ‘డాన్స్‌‌ ఇండియా డాన్స్‌‌ సూపర్‌‌‌‌ మామ్స్‌‌’కు వెళ్లమని సలహా ఇచ్చారు. దాంతో ఆడిషన్స్‌‌కు వెళ్లింది లక్ష్మి. ఆడిషన్స్‌‌లో సైరాట్‌‌ సినిమాలోని జింగాట్‌‌ పాటకు డాన్స్‌‌ చేసింది. అది చూసిన జడ్జిలంతా స్టేజి మీదికి వచ్చి లక్ష్మితో కలిసి స్టెప్పులేశారు. పర్ఫార్మెన్స్‌‌ తరువాత జడ్జిలందరికి తలా పదిరూపాయలు ఇచ్చింది లక్ష్మి. అది తీసుకొని జడ్జిలంతా లక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ‘ఇంత ఎనర్జీ ఎలా వచ్చింద’ని జడ్జి భాగ్యశ్రీ అడిగితే ‘నేను రోజూ ఉదయం చద్దన్నం తింటా. ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా. అదే నా సీక్రెట్‌‌’ అని సమాధానం ఇచ్చింది లక్ష్మి. డెబ్భై ఆరేండ్ల వయసులో అంత ఫాస్ట్‌‌బీట్‌‌ పాటకి ఆగకుండా, అలసిపోకుండా డాన్స్ చేసిన లక్ష్మిని సోషల్‌‌ మీడియాలో అందరూ మెచ్చుకుంటున్నారు.