
బెట్టింగ్ యాప్స్ విషయంలో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీని ఈడీ విచారించిన విషయం తెలిసిందే. గతనెల ఆగస్టు 13న విచారణలో భాగంగా మంచు లక్ష్మీ ఈడీ కార్యాలయానికి వెళ్లి పలు కీలక విషయాలు పంచుకుంది. అయితే, ఈ కేస్కి సంబంధించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడని మంచు లక్ష్మి.. మౌనం వీడి కీలక విషయాలు పంచుకుంది.
లేటెస్ట్గా మంచు లక్ష్మి.. ఓ ఇంటర్వ్యూలో భాగంగా బెట్టింగ్ యాప్స్ కేసుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ కేసులో మీ పేరు వార్తల్లోకి రావడం పట్ల మీ స్పందన ఏంటనీ అడగ్గా?.. లక్ష్మి తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చింది.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించాలని ఈడీ భావించడం హాస్యాస్పదంగా ఉంది. అసలు బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కడ మొదలైందనే దానిపై వారు దృష్టిపెట్టాలి. ఈ విచారణ అంశంపై మీడియా చిత్రీకరించడం పట్ల, నాపై వచ్చిన వార్తల పట్ల చాలా బాధపడ్డాను. ఎందుకంటే మేం విచారణ ఎదుర్కొంటున్న విషయం ఒకటైతే, మీడియా మరోదాన్ని హైలైట్ చేసింది. ముఖ్యంగా ఇది ఎంతో బాధపెట్టింది.
ఈడీ అధికారులు నిజానికి.. ఇటువంటి యాప్స్ నుండి వచ్చే డబ్బు ఎక్కడికి పోతుందో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగా, ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో డబ్బు ఎలా సమకూరుతోంది? ఎక్కడికి వెళ్తోంది? అనే విషయాలపై వారు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. అంతేకాకుండా, ఉగ్రవాదులకు డబ్బులు వెళ్తున్నాయా.. అనే దానిపై కూడా దృష్టిపెట్టారు.
అయితే, నాకు ఇవేవీ తెలియదు. 100 మంది ఈ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారని తెలిపారు. ఆ జాబితాలో నేనూ కూడా ఉన్నానని చెప్పారు. ఈ క్రమంలోనే నేను విచారణకు వెళ్లాను. ఇదంతా ఒక్క నిమిషం పని’’ అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.
అలాగే.. ఈడీ అధికారులను ప్రశ్నిస్తూ.. 'అసలు యాప్‌ల ఉనికి ఎక్కడ మొదలైంది? వాటి మూలాలను కనిపెట్టి, సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని' లక్ష్మి మంచు ప్రశ్నించింది. అయితే, కేసు విచారణలో ఉంది కాబట్టి, దాని గురించి తాను ఏమీ చెప్పలేనని లక్ష్మి ముగించేసింది.
ALSO READ : కిష్కింధపురికి షాకింగ్ కలెక్షన్లు..
ఆగస్టు 13న విచారణలో భాగంగా మంచు లక్ష్మీ ఈడీ ఎదుట హాజరైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద మంచు లక్ష్మీ ఇచ్చే వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికాలు, కమిషన్ లపై అరా తీసింది ఈడీ. అంతేకాకుండా చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది..? అనే కోణంలో ఈడీ విచారించినట్లు టాక్.
అయితే, ఇప్పటికే, ఇదే కేసులో ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్ హాజరైన విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్‌ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటలపాటు విచారించారు ఈడీ అధికారులు.