
హైదరాబాద్‌సిటీ, వెలుగు: బంజారాహిల్స్‌లోని హరేకృష్ణ గోల్డెన్‌టెంపుల్‌లో లక్ష్మీ నరసింహ స్వామి జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. మహాభిషేకం, హోమం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత నరసింహ స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఊంజల్ సేవ, పల్లకీ ఉత్సవంతో పాటు ప్రత్యేక ప్రవచనాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం ఉత్సవ విగ్రహానికి 108 కలశాలతో మహాభిషేకం నిర్వహించగా, పంచామృతం, పంచగవ్య, ఫల రసాలు, ఔషధాలు, నవరత్నాలు, దే శంలోని పవిత్ర నదుల నుంచి భక్తులు సేకరించిన పవిత్ర జలాలతో అభిషేకం, చక్రసాన్నం నిర్వహించారు. మహోత్సవాల్లో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
పద్మారావునగర్: సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులో 200 ఏండ్ల చరిత్ర కలిగిన ఉగ్రనరసింహ ఆలయాన్ని స్వామివారి జయంతిని పురస్కరించుకొని ఆదివారం సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో ఆగమశాస్ర్త ప్రకారం హోమాలు, అభిషేకాలు, భక్తి గీతాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మోండా మార్కెట్ డివిజన్ బండిమెట్ లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు.
గండిపేట: బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్లో శ్రీ జ్వాలా యోగ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కనులపండువగా జరిగింది. వేల మంది భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించారు.