
అమ్రాబాద్, వెలుగు: మాలల ఆరాధ్యదైవమైన రాయలగండి లక్ష్మీచెన్నకేశవ టెంపుల్‌పై రాజకీయం చేస్తున్నారని ఆ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. 24న ప్రారంభం కానున్న జాతరలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు, పోలీసులు ఇన్‌వాల్వ్ కావడం ఏంటని మండిపడుతున్నారు. బుధవారం అమ్రాబాద్ ఠాణా వద్ద అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ కృష్ణ కిషోర్, ఆర్డీవో పాండు నాయక్, అమ్రాబాద్, పదర తహసీల్దార్లతో కలిసి రెండు కమిటీలుగా ఉన్న మాలల సంఘం, బీఆర్‌ఎస్‌లోని మాలలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ... టెంపుల్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ పరిధిలోకి వెళ్లిందని, జాతరను ఈ సారి అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు. రెండు కమిటీలకు సంబంధించిన నేతలు కోఆర్డినేషన్ చేసుకొని ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఉత్సవ విగ్రహాలను ఎత్తుకెళ్లిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. సంఘం, కుల పెద్దలు వేసుకున్న కమిటీ చెల్లదని, బీఆర్‌ఎస్ నేతల కమిటీయే చెల్లుతుందని చెప్పారు. దీనిపై అభ్యంతరం తెలిపిన మాల సంఘం నేతలు టెంపుల్‌పై రాజకీయమేందని ప్రశ్నించి.. మీటింగ్ మధ్యలోనే వెళ్లిపోయారు.
నేడు అమ్రాబాద్‌లో ధర్నా
అధికారుల తీరుకు నిరసనగా మాల సంఘం కమిటీ సభ్యులు కల్ముల నాసరయ్య గురువారం అమ్రాబాద్ మండల కేంద్రంలో ధర్నాకు పిలుపునిచ్చారు. మాల కులస్తులు ఆరాధ్య దైవంగా కొలిచి రాయలగండి చెన్నకేశవ జాతరను బీఆర్‌ఎస్ కమిటీ ఎలా జరుపుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలలందరూ కలిసి ఎన్నుకున్న కమిటీని రద్దు చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఎండోమెంట్ పరిధిలోకి వెళ్తే ఇన్నాళ్లు ఎందుకు ప్రకటన చేయలేదని, ఈవోను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఒకే కమిటీ ఉండేదని, గువ్వల బాలరాజు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచే మరో కమిటీ తెరపైకి వచ్చిందని విమర్శించారు. భక్తి ఉంటే మొక్కి పోవాలి గాని, ఇలా రాజకీయాలు చేయడం సరికాదనన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు నరహరి, మల్లికార్జున్, అంబనారాయణ, లక్ష్మీ నారాయణ, రేణయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఉనికి కోసమే కాంగ్రెస్ రాద్దాంతం
కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని చాటేందుకు జాతరను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌లోని మాల కమిటీ నాయకులు విమర్శించారు. జాతర జరగకుండా ఉండేందుకు విగ్రహాలను ఎత్తుకెళ్లి దాచిపెట్టారని ఆరోపించారు. ప్రతి ఊరికి తిరిగి మాలలను ఏకం చేసి కమిటీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. అధికారుల సూచన మేరకు జాతరను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నిరంజన్, మల్లేశ్, అనిల్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.