షట్లర్ లక్ష్యసేన్కు ఘన స్వాగతం

షట్లర్ లక్ష్యసేన్కు ఘన స్వాగతం

కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత షట్లర్ లక్ష్య సేన్కు ఘన స్వాగతం లభించింది. బెంగుళూరు ఎయిర్ పోర్టులో లక్ష్య సేన్‌కు తన సన్నిహితులు, అభిమానుల నుండి అపూర్వ స్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టులో డప్పు చప్పుళ్లకు ఫ్యాన్స్ డ్యాన్సులు చేశారు. అభిమానులతో పాటు..లక్ష్యసేన్ కూడా నృత్యం చేసి వారిని ఉత్సాహ పరిచాడు. 

పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌ చేరిన లక్ష్యసేన్..ఫైనల్లో  మలేషియాకు చెందిన ఎన్జీ త్జే యోంగ్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించాడు.  ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సేన్ 19-21, 21-9, 21-16తో విజయం సాధించాడు. అంతేకాకుండా రజత పతకాన్ని సాధించిన భారత మిక్స్‌డ్ జట్టులో కూడా లక్ష్యసేన్ సభ్యుడు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత్ 1-3 తేడాతో మలేషియా చేతిలో ఓడిపోయింది.

సేన్ ఫిదా..
అటు ఎయిర్ పోర్టులో  అభిమానుల అపూర్వ స్వాగతానికి లక్ష్యసేన్ ఫిదా అయ్యాడు. సాదర స్వాగతం పలికిన అభిమానులకు, సన్నిహితులకు సేన్ ధన్యవాదాలు తెలిపాడు. ఫైనల్లో తీవ్ర ఒత్తిడికి గురయ్యానని..గెలవడం అంత సులభం కాదనుకున్నాని చెప్పాడు. అయితే గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసి దేశానికి బంగారు పతకం అందించానని చెప్పుకొచ్చాడు. 

భళా బ్యాడ్మింటన్ టీమ్..
కామన్వెల్త్ గేమ్స్లో భారత బ్యాడ్మింటన్ అద్భుత ప్రదర్శన చేసింది. మూడు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్య పతకాలతో మొత్తం ఆరు పతకాలను గెలుచుకుంది. పురుషుల, మహిళల సింగిల్స్‌ విభాగంలో పివి సింధు, లక్ష్యసేన్‌ స్వర్ణ పతకాలను సాధిస్తే.., పురుషుల డబుల్స్‌ విభాగంలో చిరాగ్‌ శెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి స్వర్ణం దక్కించుకున్నారు. అటు భారత మిక్స్‌డ్ బ్యాడ్మింటన్ టీమ్ రజత పతకం సాధించింది. పురుషుల సింగిల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో కిదాంబి శ్రీకాంత్, ట్రీసా జాలీ,గాయత్రి గోపీచంద్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

నాల్గో స్థానం..
జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో దాదాపు 200 మంది భారతీయ అథ్లెట్లు 16  విభిన్న క్రీడలలో పతకాల కోసం పోటీ పడ్డారు. ఈ గేమ్స్ లో భారత్ 61 పతకాలు సాధించింది. 22 స్వర్ణాలు, 16 రజతాలు మరియు 23 కాంస్యాలతో నాలుగో స్థానంలో నిలిచింది. వెయిట్ లిఫ్టింగ్‌లో 10 పతకాలు సాధించగా, రెజ్లింగ్ ఆరు స్వర్ణాలతో సహా 12 పతకాలతో పతక పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.