సెంట్రల్ ముంబైలో.. ధోల్ తాషా దరువులతో.. లాల్బాగ్చా రాజా శోభాయాత్ర షురూ

సెంట్రల్ ముంబైలో.. ధోల్ తాషా దరువులతో.. లాల్బాగ్చా రాజా శోభాయాత్ర షురూ

గణపతి మండపాలకు ప్రసిద్ధి చెందిన సెంట్రల్ ముంబైలోని లాల్‌బాగ్‌లో ప్రసిద్ధ లాల్​బాగ్​కా రాజా గణనాథుడితో పాటు  అన్ని గణేషు మండపాల్లో గణపతి నిమజ్జన యాత్ర ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. 10 రోజుల గణపతి ఉత్సవంలో చివరి,చివరి రోజు అయిన అనంత చతుర్దశి నాడు గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపులకు శనివారం వర్షాలను కూడా లెక్కచేయకుండా ముంబై వీధుల్లో భక్తులు పాల్గొన్నారు. ధోల్-తాషా దరువులతో ముంబై వీధులు మార్మోగాయి. అందంగా అలంకరించబడిన గణేష్ లతో శోభాయాత్ర  ఊరేగింపులలో పాల్గొన్న ప్రజలతో ముంబై రోడ్లు కిక్కిరిపోయాయి. 

ముంబయిలోని ప్రసిద్ధ లాల్​బాగ్​కా రాజా గణనాథుని శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. వర్షంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. భారీ జనసందోహం, గణేశ్​ నినాదాలతో ముంబయి వీధులు హోరెత్తుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 9 రోజుల పాటు నీరాజనాలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఆటపాటలతో ఘన వీడ్కోలు పలుకుతున్నారు.

శనివారం (సెప్టెంబర్6) ఉదయం నుంచి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయినా భక్తులు ఏమాత్రం తగ్గకుండా గణేషుల శోభాయాత్రకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఊరేగింపులో భక్తులు రంగులు జల్లుకుంటూ రంగుల ముగ్గులు వేసినట్లు రోడ్లన్నీ రంగుల మయం అయ్యాయి. 

ఇక గణేష్ ఉత్సవాల్లో చివరి రోజు అయిన అనంత చతుర్దశి నాడు విగ్రహ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలను కాపాడేందుకు ముంబైలో 21వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. 

తొలిసారిగా  రూట్ మ్యాప్, ఇతర ట్రాఫిక్ సంబంధిత అప్డేట్స్ కోసం AIని ఉపయోగిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా గిర్గావ్ చౌపట్టిలో AI ఆధారిత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గణపతి మండపాలకు QR కోడ్‌లను జారీ చేశారు. నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొనే వాహనాలకు స్టిక్కర్‌లను జారీ చేశారు.