- మాజీ ఎంపీ రవీంద్రానాయక్ డిమాండ్
పంజాగుట్ట, వెలుగు: దేశవ్యాప్తంగా పెరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో లంబాడాలకు తగిన రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని మాజీ ఎంపీ రవీంద్రానాయక్ కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిల భారతీయ మహాసేవాసంఘ్, బంజారా భారత్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గతంలో ఏర్పాటు చేసిన తండాల గ్రామ పంచాయితీలను గిరిజన రెవెన్యూ పంచాయితీలుగా మార్చాలని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతాల్లోని లంబాడాలకు రాజకీయ అవకాశాలు అందడం లేదని, అక్కడ ఇతర వర్గాల పోటీ వల్ల వీరికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.
రాబోయే డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రంలో పెరిగే 170 అసెంబ్లీ స్థానాల్లో తమ సామాజిక వర్గానికి 10 శాతం సీట్లు కేటాయించాలని విన్నవించారు. సీఎం రేవంత్ రెడ్డి లంబాడాల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారని, అందులో భాగంగానే మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నాయకులు హనుమా నాయక్, డా. జగన్ నాయక్, అశోక్ రాథోడ్, రఘు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
