గిరిజన రిజర్వేషన్ల పెంపుపై జీవో ఇస్తమన్న మాట ఏమైంది.. ?

గిరిజన రిజర్వేషన్ల పెంపుపై జీవో ఇస్తమన్న మాట ఏమైంది.. ?

ఖైరతాబాద్,  వెలుగు: అక్టోబర్ 2వ తేదీ లోగా గిరిజనులకు రిజర్వేషన్ పెంచకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని లంబాడా హక్కుల పోరాట సమితి, గిరిజన విద్యార్థి సంఘం హెచ్చరించాయి. సోమాజిగూడ ప్రెస్ క్లబ్-లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా పాల్గొని, మాట్లాడారు. వారం రోజుల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపుపై జీవో ఇస్తమన్న మాట ఏమైందని ఆయన నిలదీశారు.  రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ 8 ఏండ్లుగా మోసం చేస్తూనే ఉన్నారని వెంకట్ ఆరోపించారు. బంజారా భవన్-ను.. టీఆర్ఎస్ రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసమే బంజారా భవన్ ఏర్పాటు చేశారని.. దానికి టీఆర్ఎస్ భవన్-గా పేరు మార్చాలని సూచించారు. గంటకు వేలకు వేలు ఫీజు పెట్టి బంజారా భవన్ అడ్డాగా కొత్త దందా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్టీ రిజర్వేషన్ పెంపు పై జీవో విడుదల చేస్తామన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. రిజర్వేషన్ల పెంపు జీవోను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. లేకుంటే అక్టోబర్ 3 న ప్రగతి భవన్  ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గణేశ్ నాయక్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.