ఆత్మగౌరవం కోసం ఎంత వరకైనా పోరాడుతాం : జేఏసీ రాష్ట్ర నేతలు

 ఆత్మగౌరవం కోసం ఎంత వరకైనా పోరాడుతాం : జేఏసీ రాష్ట్ర నేతలు
  • లంబాడీ సంఘాల జేఏసీ రాష్ట్ర నేతలు
  • కొత్తగూడెంలో బంజారాల ఆత్మగౌరవ మహా ర్యాలీ

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ/గుండాల, వెలుగు : ఆత్మ గౌరవం కోసం ఎంత వరకైనా పోరాటాలు చేస్తామని లంబాడీ సంఘాల జేఏసీ రాష్ట్ర నేతలు పేర్కొన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్​ యార్డ్​ నుంచి కొత్తగూడెంలోని పోస్టాఫీస్​ సెంటర్​ వరకు ఆదివారం మహా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లంబడీ సంఘాల జేఏసీ నేతలు ఇస్లావత్​ లక్ష్మణ్​ నాయక్​, గుగులోత్​ రాజేశ్​ నాయక్, డాక్టర్​ శంకర్​ నాయక్ తోపాటు పలువురు మాట్లాడారు. 

రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే లంబాడీలను ఎస్టీలుగా ప్రభుత్వాలు గుర్తించాయన్నారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న కుట్రలో కోయ సోదరులు బలి కావొద్దన్నారు. లంబాడీల మనోభావాలను దెబ్బ తీసే విధంగా తరుచూ దుష్ప్రచారం చేస్తే సహించేలేదిలేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు, చట్ట బద్ద హక్కుల కోసం అన్నదమ్ముల వలే పోరాడుదామని కోయలకు పిలుపునిచ్చారు. 

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే కుట్రలను తిప్పికొడ్తామన్నారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటున్న తెల్లం వెంకట్రావ్​, సోయం బాపూరావు వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో లంబాడీ సమాజం గమనిస్తోందన్నారు. గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టి కొందరు రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కాగా, ఆళ్లపల్లి మండలాల్లో ఆదివాసీ, లంబాడీ తెగల మధ్య రోజు రోజుకు వర్గ పోరు ముమ్మరం అవుతోంది. 

ఆళ్లపల్లి మండలంలోని ఆదివాసీలందరూ పెద్ద ర్యాలీ, ప్రదర్శనలు చేపట్టారు. కొత్తగూడెంలో చేపట్టిన ఆత్మగౌరవ సభకు గుండాల, ఆళ్లపల్లి మండలాల లంబాడీలంతా పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పాల్వంచలోని శ్రీ కాలనీ సెంటర్ నుంచి భారీ ర్యాలీగా నాయకులు కొత్తగూ డెంతరలి వెళ్లారు. అంతుకుముందు పాల్వంచలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.