ఆ మండలంలో భూ సమస్యలు తప్పినట్లే

ఆ మండలంలో భూ సమస్యలు తప్పినట్లే
  • పైలట్​ప్రాజెక్టుగా నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం 
  • తుది దశకు చేరిన భూముల సర్వే.. మరో పదిరోజుల్లో పూర్తి 
  • వచ్చే నెల 9న  పట్టాలు ఇచ్చేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు

నల్గొండ, వెలుగు: ఏండ్లుగా నెలకొన్న భూ సమస్యలను చెక్ పెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  క్షేత్రస్థాయిలో భూముల సర్వేకు రాష్ట్రంలో రెండు మండలాలను ఎంపిక చేసింది. అందులో ఒకటి నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం. కాగా.. ఇక్కడ వచ్చిన ఫలితాల నమూనాను రాష్ట్రమంతటా అమలు చేయనుంది.

ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న తిరుమలగిరి మండలంలో కబ్జాల్లో ఉండి పట్టాలు లేకపోవడంతో సర్వే చేసి అర్హులకు పట్టాలు ఇచ్చేందుకు సర్వే నిర్వహిస్తుండగా ప్రస్తుతం 90 శాతం పూర్తి అయింది. వచ్చే నెల 9 నాటికి పట్టాలు ఇచ్చేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి..

తిరుమలగిరి మండలంలో 34  పంచాయతీలు ఉన్నాయి. ఇందులో  22 గిరిజన పంచాయతీలు, మరో 10 ఆవాస గ్రామాలు. మొత్తం 60,500 ఎకరాల భూములు ఉండగా.. 16,500 ఎకరాల్లో వివాదాలు నెలకొన్నాయి. మరో 3 వేల ఎకరాల్లో కాందీశీకుల భూములు ఉన్నాయి. సుమారు 8 వేల మంది రైతులు  ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉండి పట్టాలు లేకపోవడంతో సమస్యగా మారింది. ఎన్నో ఏండ్లుగా గిరిజనులు పొజిషన్ లో ఉంటున్నా పట్టాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి  తిరుమలగిరి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇందులో భాగంగా 90 శాతం భూ సర్వే పూర్తి చేసింది. మరో 10 రోజుల్లో 100 శాతం కంప్లీట్ చేయనుంది. పైలట్ కింద ఎంపికైన తిరుమల మండలంలోని గ్రామాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్దార్లు, సర్వేయర్లతో పాటు ఐదుగురు సభ్యుల నోడల్ టీమ్  రెండు నెలలుగా సర్వేలో నిమగ్నమైంది.