తెలంగాణలోని ఈ 3 జిల్లాల్లోనే భూ కబ్జాలు ఎక్కువ : జియో ట్యాగింగ్ చేసి గోడలు కట్టి బోర్డులు పెట్టనున్న సర్కార్

తెలంగాణలోని ఈ 3 జిల్లాల్లోనే భూ కబ్జాలు ఎక్కువ : జియో ట్యాగింగ్ చేసి గోడలు కట్టి బోర్డులు పెట్టనున్న సర్కార్

తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్​ ల్యాండ్స్​ను సర్వే చేసి జియో ట్యాగ్ చేయాలని.. వాటి చుట్టూ ఫెన్సింగ్ (ప్రహరీగోడ) నిర్మించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదించింది.

ఆ మూడు జిల్లాల్లో భారీగా కబ్జాలు  

రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజ్​గిరి, సంగారెడ్డి వంటి జిల్లాల్లో కబ్జాల సమస్య తీవ్రంగా ఉంది. పట్టణీకరణ వేగవంతం కావడంతో, ఈ జిల్లాల్లోని భూముల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకొని, వందల ఎకరాలను కబ్జా చేశారు. ప్రభుత్వానికి చెందిన పోరంబోకు, వాగులు, చెరువులు, ఖాళీ స్థలాలు ఇలా ఏది దొరికితే దాన్ని కబ్జా చేసి, ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నది. రియల్ ఎస్టేట్ విలువలు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వ భూముల కబ్జాలు తీవ్రమయ్యాయి. ఈ జిల్లాల్లో కోట్ల రూపాయల విలువ చేసే వేల ఎకరాల గవర్నమెంట్​ ల్యాండ్స్​ ఉన్నాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వల్ల ఈ భూముల్లో వందల ఎకరాలు ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. నకిలీ పత్రాలు సృష్టించడం, రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయడం, లేదా అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారా కబ్జాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్​ భూములు కాకుండా వివిధ రకాల ప్రభుత్వ భూములు 16 లక్షల ఎకరాలు పైనే ఉన్నాయి. ఈ లెక్కలపైన కూడా స్పష్టత లేదు. 

ఫెన్సింగ్​తో పాటు‘ఇది ప్రభుత్వ భూమి’ అని బోర్డులు 

జియో ట్యాగ్  చేసిన భూముల చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీగోడ నిర్మించాలని రెవెన్యూ శాఖ అధికారులు ప్రతిపాదించారు.  ఈ ఫెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ‘ఇది ప్రభుత్వ భూమి’ అని సూచించే బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. దీనివల్ల.. భూమిని కొనడానికి ప్రయత్నించే అమాయకులకు కూడా ఈ భూమి ప్రభుత్వానిదని తెలుస్తుంది.  ఆక్రమణదారులు భూమిలోకి అడుగు పెట్టకుండా నివారించవచ్చు. జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు ప్రభుత్వ భూములను ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్యవేక్షించవచ్చు. ఈ ప్రణాళికను త్వరలోనే అమలు చేయనున్నారు. మొదటి దశలో పైలట్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కొన్ని జిల్లాల్లో  ప్రారంభించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నారు.

జియో ట్యాగింగ్​ ఇట్ల..!

మొదట ప్రభుత్వానికి చెందిన భూములను గుర్తించి, వాటి సరిహద్దులను అధికారులు స్పష్టంగా నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో ఆధునిక సర్వే పద్ధతులను ఉపయోగిస్తారు. ప్రభుత్వ భూముల హద్దులను ఖచ్చితంగా గుర్తించడానికి డిజిటల్ సర్వే నిర్వహిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూభాగాన్ని జియో ట్యాగ్ చేస్తారు.  ప్రతి ప్రభుత్వ భూమికి ఒక ప్రత్యేకమైన జియో కోడ్ కేటాయిస్తారు. ఈ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి.. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్​) సహాయంతో ఆ భూమి ఎక్కడ ఉందో, దాని విస్తీర్ణం ఎంత, దాని చుట్టూ ఉన్న ఇతర ఆస్తులు ఏమిటి అనే వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే, జియో ట్యాగింగ్ ద్వారా దాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ఇది కబ్జాదారుల ప్రయత్నాలను ప్రారంభ దశలోనే అడ్డుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రక్రియ వల్ల భూముల భౌగోళిక సమాచారం డిజిటల్ రికార్డుల్లో నిక్షిప్తమవుతుంది. క్షేత్రస్థాయిలోని, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని కొలతలకు అంగుళం కూడా తేడా ఉండదు. కబ్జాకు యత్నిస్తే ఆ చిత్రాలు చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కోర్టుల్లో సాక్ష్యంగా ఉపయోగించి.. చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. దీంతో భవిష్యత్తులో ఒకే బటన్​తో ప్రభుత్వ భూముల వివరాలన్నీ తెలుసుకోవడంతో పాటు వాటిని కాపాడుకునేందుకు అవకాశం ఉంటుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.