రెండేండ్ల సమస్య..ఐదు రోజుల్లో తీరింది

రెండేండ్ల సమస్య..ఐదు రోజుల్లో తీరింది

కరీంనగర్, వెలుగు: ధరణి పోర్టల్​లో, పట్టాదారు పాస్ బుక్ లో నమోదైన తప్పును సరి చేయాలని ఓ రైతు రెండేండ్లుగా తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య.. కేవలం ఐదు రోజుల్లో క్లియరైంది. రెండేండ్లలో ఏనాడూ సదరు రైతు సమస్యను పట్టించుకోని ఆఫీసర్లు.. తీరా అతడు ఆత్మహత్య చేసుకున్నాక స్పందించారు. తమ తప్పేం లేదంటూనే ఐదు రోజులుగా బుకాయిస్తూ వచ్చి మంగళవారం.. ఆ తప్పును సవరించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ రెవెన్యూ పరిధిలోని ఐలోనిపల్లికి చెందిన ఏనుగుల మల్లేశం(55)కు  సర్వేనంబర్ 273/ఏ/బీలో ఉన్న 5 గుంటల భూమి స్వభావం(నేచర్ ఆఫ్ ల్యాండ్) పట్టాకు బదులు నీరటి ఇనాంగా పాస్ బుక్ లో, ధరణి పోర్టల్ లో నమోదైంది. దీంతో నీరటి ఇనాం భూమిని పట్టాగా మార్చాలని ఆయన టీఎం 33 మాడ్యుల్ ద్వారా ధరణి పోర్టల్ లో అప్లై(2200093686) చేసుకున్నారు.

అలాగే తన ఇంటి పక్కన సర్వే నంబర్ 298లో ఉన్న తన 20 గుంటల వ్యవసాయ భూమి హౌజ్​ సైట్స్ గా నమోదైంది.ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని కొన్నాళ్లుగా మల్లేశం తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 13న కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసు ఆవరణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన జరిగిన మరుసటి రోజే కలెక్టర్ నోటీస్ జనరేట్ చేశారు. తహసీల్దార్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని మంగళవారం అప్లికేషన్ అప్రూవల్ చేసి నీరటి ఇనాంను పట్టాగా మార్చేశారు. మల్లేశం ఆత్మహత్య చేసుకోక ముందే కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్లు స్పందించి ఉంటే ఆయన ప్రాణాలు దక్కేవని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు.