
మంచిర్యాల జిల్లాలో భూకబ్జాలు..హక్కుదార్ల ప్రాణాల మీదికి తెస్తున్నాయి. కబ్జాపెట్టడం, బెదిరించడం, రికార్డుల తారుమారు.. పరిపాటిగా మారింది. అధికారుల అండతో భూమి కనిపిస్తే చాలు జెండా పాతేస్తున్నారు. ఇదేంటనీ అడిగితే బెదిరింపులు..అధికారుల దగ్గరికి వెళ్తే నో రెస్పాన్స్..ఏం చేయలేక పాపం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. జైపూర్ మండలంలో తాటిపల్లి శ్రీనివాస్..అలియాస్ డీలర్ శ్రీను.. భూకబ్జాలకు అంతు లేకుండా పోయింది. రేషన్ డీలర్ గా తన ప్రస్థానం మొదలెట్టి..రాజకీయ నేతగా ఎదిగి..అందిన కాడికి జెండా పాతేస్తున్నాడు. డబ్బు, పలుకుబడితో రెవిన్యూ అధికారులను మచ్చిక చేసుకుని.. అక్రమాలు చేస్తున్నాడు. అమాయకులైన రైతుల్ని నమ్మించి..నయానో,బయనో ఒప్పించి..వాళ్ల భూముల్ని సొంతం చేసుకుంటున్నాడు. తన పేరు, తన బంధువుల పేర్ల మీద రికార్డులు మార్చేసుకుంటున్నాడు డీలర్ శ్రీను.
నర్సింగాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 102లోని దాదాపు 40 ఎకరాల భూమిని రెండేళ్ల క్రితమే నొక్కేశాడు డీలర్ శ్రీను. రికార్డులు చూస్తే అసలు హక్కుదారులు గోత్రాల కులస్తులు. ఈ భూమిని రెవిన్యూ అధికారుల అండతో..తన పేరిట భూమిని మార్చుకున్నాడు. అసలు విషయం తెలిసి..హక్కుదారులు నిరసనబాట పట్టారు. జైపూర్ తహసీల్దార్ ఆఫీసు ముందు ఆందోళన చేశారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చారు గోత్రాల కులస్థులు. తమ భూమి తమకు ఇవ్వకుంటే.. సామూహిక ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా…ఫలితం లేకపోవడంతో… న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టారు బాధితులు. ఇది సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు సీఎం.
జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరి, రెవెన్యూ అధికారులతో ..గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. భూమి హక్కుదారులు గోత్రాల కులస్తులేనని ఎంక్వైరీలో తేలింది. దీంతో బాధితులకు పట్టాలివ్వాలని నిర్ణయించారు. కలెక్టర్ నర్సింగాపూర్ గ్రామానికి స్వయంగా వెళ్లి..వివరాలు తెలుసుకున్నారు. గ్రామ ప్రజలందరి ముందు విచారణ చేశారు కలెక్టర్. డీలర్ శ్రీను అక్రమాలు బయటపడటంతో.. గోత్రాల కులస్తులకు భూమి పత్రాలు ఇచ్చేందుకు రికార్డులు తయారు చేస్తున్నారు అధికారులు.
ఇందారంలోనూ కబ్జా అవతారం ఎత్తాడు డీలర్ శ్రీను. ఊరు శివారులోని 120, 121 సర్వేల్లోని ప్రభుత్వ భూముల్ని, 123 సర్వేలోని ఎస్సీలకు చెందిన పది ఎకరాల భూమి, 108 సర్వేలోని గిరిజనుల సీలింగ్ భూములతో పాటు 411 సర్వేలోని 9 ఎకరాలను పట్టా చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు తన సొంతూరైన నర్సింగాపూర్ లో 102 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో.. 60 ఎకరాలు కబ్జా చేశాడనే విమర్శలున్నాయి. ఈమధ్యే జైపూర్ మండలం దుబ్బపల్లి శివారులో 336/1,2,3,4 సర్వే నెంబర్లలోని 10 ఎకరాల అసైన్డ్ భూమిని.. తనపేరు మీద మార్చుకుని…తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నాడని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇదే విషయంపై వెంకట్రావుపల్లి వార్డు సభ్యులు, ప్రజలు మండల స్పెషల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేశారు. పేద రైతులను మోసం చేయడంతో పాటు పంచాయతీ అవసరాలకు ఉద్దేశించిన ప్రభుత్వ భూమిని కజ్జా చేసి అమ్ముకున్న డీలర్ శ్రీనుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు జనం.