రాతి గుట్టలపై రియల్టర్ల బాంబులు

రాతి గుట్టలపై రియల్టర్ల బాంబులు
  • రాతి గుట్టలపై రియల్టర్ల బాంబులు
  • రూల్స్ కు విరుద్ధంగా జిలిటెన్ స్టిక్స్ వినియోగం
  • భూముల ధరలు పెరగడంతో ఇష్టారాజ్యం
  • కలెక్టరేట్​సమీపంలోనే దందా
  • కన్నెత్తి చూడని ఆఫీసర్లు

మహబూబాబాద్, వెలుగు: మానుకోట జిల్లాకేంద్రం కావడంతో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. మెడికల్ కాలేజీ కూడా మంజూరు కావడంతో రియల్ ఎస్టేట్ దూసుకెళ్తోంది. ఇదే అదునుగా భావించిన రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గుట్టలపై ఉన్న రాయిని బాంబులతో పేల్చి, సాఫ్ చేస్తున్నాడు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రూల్స్ కు విరుద్ధంగా జిలిటెన్ స్టిక్స్ వినియోగిస్తున్నా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదు.

ఎగిరిపడుతున్న రాళ్లు..

జిల్లాకేంద్రంలోని రాతి గుట్టలను రియల్టర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసి, బాంబులు పెట్టి రాళ్లు తీస్తున్నారు. అనంతరం వెంచర్లు వేసి, అమ్మేస్తున్నారు. బాంబుల దాటికి పెద్ద పెద్ద రాళ్లు ఎగిసిపడుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. రాళ్లను పెకిలించడం కోసం జిలిటెన్ స్టిక్స్, గన్ పౌడర్ వాడుతున్నారు. ప్రధానంగా తొర్రూరు–శనిగపురం రోడ్డు, పాత, కొత్త కలెక్టరేట్, కురవి మండలం బలపాల, నేరడ గ్రామాల సమీపంలో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. మహబూబాబాద్  మండల పరిధిలోని జంగిలిగొండ, నెల్లికుదురు మండలం నరసింహులగూడెం, బంజారా స్టేజీ, తొర్రూరు పట్టణ కేంద్రంలోని కంఠాయపాలెం రోడ్డు సమీపంలోనూ బ్లాస్టింగ్​లు జరుగుతున్నాయి. ఇటీవల నెల్లికుదురు మండలం నల్లగుట్ట తండాలో బ్లాస్టింగ్ దాటికి ఇండ్ల రాళ్లు పడడంతో ప్రజలు ఆందోళన చెందారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

అనుమతులు లేకుండానే..

జిల్లాకేంద్రంలోని రియల్టర్లు అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. అంతేకాక గుట్టలను పేలుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బ్లాస్టింగ్ అనుమతి కోసం రెవెన్యూ, పోలీస్, మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి పొందాల్సి ఉన్నా.. అవేమీ పట్టించుకోవడం లేదు. పేలుడు సమయంలో తగిన జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. ఆఫీసర్లు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.