సర్వేయర్లు వస్తున్నరు .. లైసెన్స్​డ్ సర్వేయర్ల నియామకంతో స్పీడప్ కానున్న భూ సర్వే

సర్వేయర్లు వస్తున్నరు .. లైసెన్స్​డ్ సర్వేయర్ల నియామకంతో స్పీడప్ కానున్న భూ సర్వే
  • ఈనెల 17 వరకు దరఖాస్తుల స్వీకారం 
  • 26 నుంచి శిక్షణతీరనున్న రైతుల భూ సమస్యలు

ఆదిలాబాద్, వెలుగు: భూ భారతి చట్టం 2025 అమలులో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్రంలో సర్వేయర్ల కొరత తీర్చేందుకు లైసెన్స్​డ్ సర్వేయర్లను నియమించనుంది. అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈనెల 17తో గడువు ముగియనుంది. దరఖాస్తుల స్వీకరణ అనంతరం అర్హులైన వారిని ఎంపిక చేసి, వారికి ట్రైనింగ్​ఇచ్చి లైసెన్సులు అందించనుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 46 దరఖాస్తులు వచ్చాయి. 

వేధిస్తున్న కొరత..

ఆదిలాబాద్ జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా భూ సర్వే పనులకు ఆటంకం ఏర్పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో కేవలం 8 మంది మండల సర్వేయర్లు, ఇద్దరు డిప్యూటీ సర్వేయర్లు మాత్రమే విధులు నిర్వహిస్తుండడంతో పనులు సజావుగా సాగడంలేదు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ల్యాండ్ మిస్సింగ్, పట్టదారు పేర్లు మారిపోవడం, విస్తీర్ణంలో తేడాలు రావడం వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. తమ భూముల సర్వే కోసం దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ సర్వేయర్ల కొరత కారణంగా నెలల తరబడి సమస్యలు పెండింగ్ లోనే ఉండిపోతున్నాయి. ఈ క్రమంలోనే లైసెన్స్​డ్ సర్వేయర్లు అందుబాటులోకి వస్తే భూ సర్వే పనులు వేగవంతమయ్యే అవకాశాలున్నాయి.  

ట్రైనింగ్​ఇలా..

భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా సర్వే ల్యాండ్ రికార్డు సహాయకులుగా లైసెన్స్​డ్ సర్వేయర్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మే 26 నుంచి 50 రోజుల పాటు  మూడు విడతల్లో వారికి శిక్షణ అందించనుంది. థియరీ, టిప్పన్ ప్లాటింగ్, ఫీల్డ్ లెవల్​లోఈ ట్రైనింగ్ ఉండనుంది. దీని తర్వాత మండల సర్వేయర్ కింద ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారు. ఈ ట్రైనింగ్​లో ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీలు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ. 2,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ సక్సెస్​ఫుల్​గా పూర్తిచేసుకున్నవారికి జిల్లా స్థాయిలో పరీక్ష నిర్వహిస్తారు. అందులో పాసైతే ఫైనల్ అసెస్​మెంట్ టెస్టు నిర్వహించి, అందులో ప్రతిభ కనబర్చిన వారికి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్​ఫర్మేషన్ అండ్ మేనేజ్​మెంట్ విభాగం ద్వారా లైసెన్సులు జారీ చేస్తారు. వీరితో పాటు రెగ్యులర్ సర్వేయర్లను నియామించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

దరఖాస్తు చేసుకోవాలి..

ప్రభుత్వం కల్పిస్తున్న లైసెన్స్​డ్​ సర్వేయర్ల అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందుకు ఈనెల 17 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ అనంతరం అర్హులైన వారికిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి లైసెన్స్ జారీ చేస్తాం.

రవీందర్, సర్వే ల్యాండ్ రికార్డు, ఏడీ, ఆదిలాబాద్