
- ముక్త్యాల ఎంబీసీ లిఫ్ట్ బాధిత రైతుల డిమాండ్
- తమ భూములు ఇవ్వబోమంటూ మరికొందరు నిరసన
- రైతుల అభిప్రాయ సేకరణలో ఆర్డీవోకు వినతులు
మేళ్లచెరువు(చింతలపాలెం): మార్కెట్ రేటు ప్రకారం పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని ముక్త్యాల ఎంబీసీ లిఫ్ట్ భూ నిర్వాసిత రైతులు కోరారు. చింతలపాలెంలో శుక్రవారం హుజూరునగర్ ఆర్డీవో శ్రీనివాసులు రైతులతో అవగాహన సమావేశం నిర్వహించి మాట్లాడారు. పాత వెల్లటూరు వద్ద ఏర్పాటు చేస్తున్న కొత్త లిఫ్ట్ భూసేకరణకు సహకరించాలని రైతులను కోరారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎకరాకు రూ. 16 లక్షల నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. పంప్ హౌజ్ నిర్మాణానికి 68 ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు.
లిఫ్ట్ నిర్మిస్తే దాని పై భాగాన ఉన్న మరో 28 ఎకరాలకు దారి ఉండదని రైతులు చెప్పడంలో ఆ స్థల సేకరణ చేపడతానని చెప్పారు. మధ్యలో రైతులు కలగజేసుకుని తమకు నష్టపరిహారం మార్కెట్ రేట్ ను బట్టే ఇవ్వాలని, లేదంటే ఇవ్వమని తేల్చి చెప్పారు. మరి కొందరు రైతులు లిఫ్ట్ వద్దని నిరసన వ్యక్తం చేశారు. కొత్త లిఫ్ట్ పైప్ లైన్ కోసం తమ భూమిని ఇవ్వమని తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నా భూసేకరణ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రాత పూర్వకంగా అభ్యంతరాలు తెలియజేయాలని రైతులకు ఆర్డీఓ సూచించగా వినతిపత్రాలను అందజేశారు.ఈ సమావేశంలో తహసీల్దార్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.