ప్రమోషన్లు ఇవ్వాలంటూ లాంగ్వేజీ పండిట్స్ నిరసన

ప్రమోషన్లు ఇవ్వాలంటూ  లాంగ్వేజీ పండిట్స్ నిరసన
  • నైన్త్, టెన్త్​ క్లాసులకు వెళ్లే ప్రసక్తే లేదు
  • లాంగ్వేజీ పండిట్ జేఏసీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిది, పదో తరగతికి పాఠాలు చెప్పబోమని లాంగ్వేజీ పండిట్ జేఏసీ నిర్ణయం తీసుకున్నది. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తమకూ ప్రమోషన్లు ఇవ్వాల్సిందేనని జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు సీ.జగదీశ్, ఎండీ.అబ్దుల్లా, సీహెచ్ శ్రీనివాస్, నర్సిములు స్పష్టం చేశారు. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులను కలిసి ఇదే విషయమై నోటీసులు అందజేసినట్టు చెప్పారు. జాబ్ చార్ట్ ప్రకారం 6, 7, 8 క్లాసులకు మాత్రమే ఇక నుంచి పాఠాలు చెప్తామని పేర్కొన్నారు. అయితే, 2017 ప్రపంచ తెలుగు మహాసభల్లో కేసీఆర్ ఇచ్చిన హామీకి అనుగుణంగా 2021లోనే 8,630 పండిట్, 1,849 పీఈటీ పోస్టులను ప్రభుత్వం అప్ గ్రేడ్ చేసిందని, కానీ, కోర్టు కేసుల సాకుతో వారికి ప్రమోషన్లు మాత్రం ఇవ్వలేదని తెలిపారు.

దీంతో కొన్నేండ్ల నుంచి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు నోచుకోవడం లేదన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1 నుంచి పాఠాలు బంద్ చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే తమ సమస్య పరిష్కారం కోసం కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇచ్చామని, అయినా, పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లాంగ్వేజీ పండిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ 28 నుంచి 30 దాకా సీఎం కేసీఆర్​కు లేఖలు రాస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే మూడువేల దాకా స్పీడ్ పోస్టులు చేసినట్టు పేర్కొన్నారు.