
హైదరాబాద్ : సికింద్రాబాద్ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల వివరాలను మీడియాకు వెల్లడించారు. సీతాఫల్ మండిలో ఉన్న కుట్టివేలోడి ఆస్పత్రిని కొత్త హంగులతో నిర్మిస్తున్నట్లు, 30 పడకల ఆసుపత్రి కోసం రూ. 11 కోట్ల 60 లక్షల నిధులను విడుదల చేశామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. లాలాపేట్ లో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టామని చెప్పారు.
నేషనల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతున్నట్లు పద్మారావు వివరించారు. పూల్ నిర్మాణం పూర్తైతే.. పోటీలు నిర్వహించే వీలు కలుగుతుందన్నారు. అడ్డగుట్టలో ఒక కళ్యాణ మండపం నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. సంవత్సరం లోపు వీటి నిర్మాణాలు పూర్తవుతాయన్నారు.