లష్కరే తోయిబా టాప్​టెర్రరిస్ట్​ సైఫుల్లాను కాల్చిన చంపిన దుండగులు

లష్కరే తోయిబా టాప్​టెర్రరిస్ట్​ సైఫుల్లాను కాల్చిన చంపిన దుండగులు

ఇస్లామాబాద్: లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ (ఎల్‎ఈటీ) టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్‌‌లోని సింధ్​ ప్రావిన్స్‎లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఖలీద్‌‌ను కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే లాంచ్ కమాండర్లతో కలిసి సైఫుల్లా ఖలీద్ పని చేస్తున్నాడు. భారత్‌‌లో సైఫుల్లా అనేక హై ప్రొఫైల్ ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. 

టెర్రరిస్టులు నేపాల్ నుంచి భారత్‌‌లోకి చొరబడేందుకు ఖలీద్ సాయం చేస్తూ వస్తున్నాడు. 2006లో నాగ్​పూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి వెనక ఖలీద్ హస్తం ఉన్నది. 2005 లో బెంగళూరులో ఇండియన్​ సైన్స్​కాంగ్రెస్  క్యాంపస్ దాడి, 2008లో జమ్మూ కాశ్మీర్‎లోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌‌పై దాడి ఘటనలోనూ సైఫుల్లా ఖలీద్ నిందితుడని అధికారులు తెలిపారు.

నేపాల్‎లో మారుపేరుతో..

వినోద్​కుమార్ అనే మారుపేరుతో ఖలీద్ చాలా ఏండ్లుగా నేపాల్‎లో స్థిరపడ్డాడు. తప్పుడు ధ్రువీకరణతో అక్కడ నివాసమున్నాడు. స్థానిక మహిళ నగ్మా బానును వివాహం చేసుకున్నాడు. నేపాల్ నుంచే అతడు ఎల్​ఈటీ కోసం కార్యకలాపాలు నిర్వహించాడు. ఇటీవల పాకిస్తాన్​ సింధ్ ప్రావిన్స్‌‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. అక్కడ కూడా అతడు యునైటెడ్​నేషన్​నిషేధించిన పాకిస్తానీ ఉగ్రవాద సంస్థ 
లష్కరే తోయిబా, దాని ప్రధాన సంస్థ జమాత్-ఉద్ -దవా కోసం పనిచేయడం కొనసాగించాడు.