- ఆమె కుటుంబానికి అండగా ఉంటాం
హైదరాబాద్, వెలుగు: దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తీరని లోటని, ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది కాలానికే రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నందిత మృతికి సంతాపం ప్రకటిస్తున్నానని, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభం కాగా, లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్టు చెప్పారు. ‘‘లాస్య నందిత తండ్రి సాయన్న నాకు అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు. చాలా ఏండ్లు మేం కలిసి పనిచేశాం. నిజామాబాద్ లో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా ఎంతో సేవ చేశారు. కంటోన్మెంట్ ను జీహెచ్ ఎంసీలో కలపాలని సాయన్న ఎంతో కాలంగా డిమాండ్ చేశారు.
ఆ డిమాండ్ పరిష్కారానికి నోచుకున్నప్పుడు ఆయన సభలో లేకపోవడం బాధాకరం. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన మరణించడంతో తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు సాయన్న కూతురు లాస్య నందిత ప్రజాజీవితంలోకి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. ఆ కుటుంబానికి ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. కంటోన్మెంట్ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు. వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది” అని తెలిపారు.
ఏడాది వ్యవధిలో తండ్రీకూతుళ్ల మరణం బాధాకరం: కేటీఆర్
ఏడాది వ్యవధిలోనే తండ్రీకూతుళ్లు సాయన్న, లాస్య నందిత మృతిచెందడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సాయన్న మరణించిన తర్వాత పార్టీనుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కూతురు లాస్య నందితకు అవకాశం కల్పించామని చెప్పారు. తండ్రి ఆశీస్సులు, పార్టీ అండతో ఆమె బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారని తెలిపారు. కొద్దిరోజులకే ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదంలో చనిపోయారని అన్నారు. మంచి వ్యక్తిత్వం, విద్యార్హతలు కలిగిన లాస్య నందిత ప్రజలకు ఎంతో సేవ చేస్తారని భావించామని, కానీ ఎమ్మెల్యేగా గెలిచాక కొద్దిరోజులకే మరణించడం బాధాకరమని అన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
తీర్మానాన్ని బలపరిచిన సభ్యులు
లాస్య నందిత మృతికి సంతాపంగా సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులు బలపర్చారు. ఈ సందర్భంగా తీర్మానంపై పలువురు మాట్లాడారు. లాస్య నందిత చాలా చురుకైనదని, ఆమె మరణం తీరని లోటని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత.. తక్కువ టైమ్ లోనే మరణించటం చాలా బాధాకరమని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆమె కుటుంబానికి బీజేపీ తరఫున సానుభూతి ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఒకే ఏడాదిలో సాయన్న, ఆయన కూతురు నందిత మృతి చెందడం బాధాకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారని, ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. కాగా, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి అసెంబ్లీ నివాళి అర్పించింది. రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
