
- బెంగళూరులో మహిళ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
బెంగళూరు: గోనె సంచిలో కట్టి ఉన్న మహిళ మృతదేహం చెత్తకుప్పలో దొరికిన ఘటన బెంగళూరులో తీవ్ర కలకలం రేపింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. ఆమెతో సహజీవనం చేస్తున్న అస్సాంకు చెందిన 33 ఏండ్ల వ్యక్తే ఆమెను గొంతుకోసి చంపినట్లు తేల్చారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు.
ఏడాదిన్నరగా లివ్‌ఇన్‌లో..
బెంగళూరు మున్సిపాలిటీ చెత్త లారీలో ఓ మహిళ మృతదేహాన్ని వర్కర్లు ఆదివారం గుర్తించారు. చేతులు కట్టేసి, గోనెసంచిలో కుక్కిఉన్న ఆమె డెడ్‌బాడీని పోస్ట్‌మార్టానికి పంపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 35 ఏండ్ల ఆశాగా ఆమెను గుర్తించారు. పెండ్లయి భర్త నుంచి విడిపోయిన ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివాసం ఉంటోంది. స్థానికంగా హౌస్ కీపింగ్ పనులు చేసుకుంటున్న ఆమెకు అస్సాంకు చెందిన మహ్మద్ షంషుద్దీన్ పరిచయమయ్యాడు.
ఇద్దరూ కలిసి దంపతులుగా చలామణి అవుతూ కిరాయికి ఉంటున్నారు. అయితే, కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన వాగ్వాదం గొంతుకోసి చంపేదాకా వెళ్లింది. ఆపై షంషుద్దీన్ ఆశా డెడ్‌బాడీని గోనెసంచిలో కట్టి బైక్‌మీద తీసుకెళ్లి చెత్తలారీలో పడేసి పరారయ్యాడు. ఇదంతా సీసీటీవీలో రికార్డయింది. విజువల్స్ ఆధారంగా షంషుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి కూడా పెండ్లికాగా ఇద్దరు పిల్లలున్నారని, వాళ్లంతా అస్సాంలోనే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఆశాతో ఏడాదిన్నరగా లివ్‌ఇన్‌లో ఉన్నాడని చెప్పారు.