తొవ్వ చూపించే టెక్ : మెట్లెక్కించే వీల్​చైర్​

తొవ్వ చూపించే టెక్ : మెట్లెక్కించే వీల్​చైర్​

దివ్యాంగులు ఎక్కడికి వెళ్లాలన్నా ఇబ్బందే. దారిలో ఎన్నెన్నో అవాంతరాలు ఎదురవుతుంటాయి. కాళ్లు లేనోళ్లు మెట్లు ఎక్కలేరు. అంధులకు ముందేముందో తెలియదు. నరాలు, కండరాలు చచ్చుబడిపోయినోళ్లు అడుగు తీసి అడుగు వేయలేరు. అలాంటి వాళ్లకు చిన్నాచితకా పరిష్కారాలున్నా అవి కొద్ది వరకే పరిమితమవుతున్నాయి. మరి, పూర్తిగా వాళ్లకు అండగా నిలబడే పరిష్కారాల్లేవా? అంటే ఓ మూడు కంపెనీలు ఆయా వర్గాల వారికి టెక్నాలజీతో పరిష్కారం చూపించింది. ఆ కంపెనీలు తయారు చేసిన మూడు పరికరాలు వాళ్లను ముందుకు నడిపించే బాటలు వేశాయి.

మెట్లెక్కించే వీల్చైర్

కాళ్లు లేనోళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. మెట్లెక్కలేరు. వీల్​చైర్​ ఉంటే తప్ప ముందుకు సాగలేరు. అలాంటి వాళ్ల కోసం స్విట్జర్లాండ్​ కంపెనీ స్కూవో ఓ స్పెషల్​ వీల్​చైర్​ను తయారు చేసింది. స్మార్ట్​ఫోన్​తో దానిని నియంత్రించేలా టెక్నాలజీ హంగులు అద్దింది. మెట్లు, ఇతర ఎగుడుదిగుడు దారుల్లో సాఫీగా తీసుకుపోయేలా రూపునిచ్చింది. ఆ వీల్​చైర్​కు రబ్బర్​ ట్రాక్​లు పెట్టింది. ఆ రబ్బర్​ ట్రాక్​లే మెట్లెక్కించి దివ్యాంగులను పైకి తీసుకెళతాయి. జోస్​ డి ఫెలిస్​ అనే దివ్యాంగుడు యూట్యూబ్​లో పరిష్కారం కోసం వెతుకుతుండగా స్కూవో వీల్​ చైర్​ కనిపించింది. వెంటనే కంపెనీతో మాట్లాడాడు. దీంతో అతడిపైనే కంపెనీ తొలిసారి ఆ వీల్​చైర్​ను టెస్ట్​ చేసింది. చాలా సమర్థంగా పనిచేసింది ఆ వీల్​చైర్​. 2019 చివరి నాటికి వాటిని దివ్యాంగులకు అందించేలా కంపెనీ చర్యలు తీసుకుంటోంది. మొదటి వీల్​చైర్​ను ఫెలిస్​ అందుకోబోతున్నాడు.