భార్య మృతి కేసులో భర్త అరెస్ట్

భార్య మృతి కేసులో భర్త అరెస్ట్

బషీర్​బాగ్, వెలుగు: వివాహిత అనుమానాస్పద మృతి కేసును నారాయణగూడ పోలీసులు ఛేదించారు. భర్తే ఆమెను చంపినట్లు తేల్చి అతడిని అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్​పేటకు చెందిన లాయర్ జైపాల్ రెడ్డి పెద్ద కుమార్తె లహరి(27)కి హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన వల్లభ్ రెడ్డితో గతేడాది పెళ్లైంది. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు జైపాల్ రెడ్డి హైకోర్టుకు వెళ్తుండగా.. అతడి భార్య ఫోన్ చేసింది. లహరి ఇంట్లో కళ్లు తిరిగి కిందపడిపోయిందని, తలకు దెబ్బతగలడంతో హాస్పిటల్​కు తీసుకెళ్లారని తెలిపింది. జైపాల్ రెడ్డి వెంటనే హాస్పిటల్​కు చేరుకోగా.. అప్పటికే లహరి చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. నారాయణగూడ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. లహరి కళ్లు తిరిగి పడిపోవడంతోనే ఆమె తలకు గాయమైందని భర్త వల్లభ్ రెడ్డి మొదట పోలీసుల విచారణలో తెలిపాడు. ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించేందుకు యత్నించాడు. అయితే, ఆమెను తీవ్రంగా కొట్టడం వల్లే తలకు గాయమై చనిపోయినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులు ఈ నెల 26న  వల్లబ్ రెడ్డిని నల్గొండలో అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

 కేసు కాకుండా రాజకీయ ఒత్తిడి

వల్లభ్ రెడ్డి తండ్రి రంగసాయి రెడ్డి నల్గొండ జిల్లాలో పేరొందిన కాంగ్రెస్ నేత.  అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే  పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ కేసు విషయంలో సెటిల్​మెంట్ చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ‘రాజకీయ కుట్రలో భాగంగానే నా కొడుకుపై కేసు పెట్టించారు. కొడుకు, కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. భార్యను చంపాల్సిన అవసరం అతడికి ఏముంటుంది. పోలీసులే నా కొడుకుతో బలవంతంగా ఒప్పించారు.’ అని రంగ సాయి రెడ్డి ఆరోపించారు. మరోవైపు తన కుమార్తె మృతిపై ఎలాంటి అనుమానం లేదని లహరి తండ్రి జైపాల్ రెడ్డి చెబుతున్నారు.