‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ 

‘అగ్నిపథ్’ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ 

‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఎంఎల్ శర్మ (మనోహర్ లాల్ శర్మ) అనే న్యాయవాది ఈ పిల్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. కేంద్రం (రక్షణశాఖ) ప్రకటించిన అగ్నిపథ్ నోటిఫికేషన్ భారత రాజ్యాంగానికి తీవ్ర విఘాతం కల్గిస్తుందని, ఇది చట్ట వ్యతిరేకమని పిటిషన్ లో ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. 

అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళన, పోరాటాలు చేస్తున్నారు.  అగ్నిపథ్ ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అగ్నిపథ్ పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కేవలం అగ్నిపథ్ ద్వారానే రిక్రూట్ మెంట్ ఉంటుందని.. సాధారణ రిక్రూట్ మెంట్ లేదని భారత రక్షణ శాఖ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పై యువతకు రక్షణ శాఖ క్లారిటీ ఇచ్చింది. యువతకు అగ్నిపథ్ మేలు చేస్తుందని త్రివిధ దళాలు అంటున్నాయి. భారతీయ సైన్యానికి క్రమశిక్షణ తప్పనిసరి సైనిక వ్యవహారాల శాఖ అదనపు సెక్రటరీ అనిల్ పురి అన్నారు. విధ్వంసాలకు పాల్పడినవారికి ఆర్మీలో అవకాశమే లేదని తేల్చి చెప్పారు. 

మరోవైపు.. ‘అగ్నిపథ్’పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మంగళవారం (జూన్ 21న) భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ స్కీమ్ పై వారు ప్రధాని మోడీకి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. త్రివిధ దళాలకు తేజస్సును అద్దే ప్రయత్నాల్లో భాగంగానే అగ్నిపథ్ స్కీమ్ కు శ్రీకారం చుట్టామని ఆదివారం (జూన్ 19న) నిర్వహించిన మీడియా సమావేశంలో త్రివిధ దళాలు తెలిపాయి. దాని అమలు విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశాయి. అగ్నిపథ్ పథకం ద్వారా భర్తీ అయ్యే అగ్ని వీర్లకు సైనికులతో సమానమైన ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొన్నాయి. ఆర్మీలో ఇకపై కేవలం అగ్నిపథ్ ద్వారానే సైనికుల నియామకాలు జరుగుతాయని తేల్చి చెప్పారు.