- యూపీలోని ఘజియాబాద్‌లో టెన్షన్
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా కోర్టు మంగళవారం రణరంగంగా మారింది. ఓ జడ్జి, లాయర్ మధ్య వాగ్వాదం జరగ్గా.. అదికాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. జడ్జి తీరుకు నిరసనగా లాయర్లు ఆందోళన చేయడం, దీంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాయర్లను పోలీసులు కోర్టు బయటకు పంపించారు.
ఈ క్రమంలో వాళ్లపై లాఠీచార్జ్ చేశారు. ఒకరిద్దరు పోలీసులు కుర్చీలు ఎత్తి లాయర్లపైకి దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ బయటకురావడంతో సంచలనంగా మారింది. పోలీసుల లాఠీచార్జ్ లో కొంతమంది లాయర్లకు గాయాలయ్యాయి. ఈ సంఘటనతో జడ్జీలందరూ కేసుల విచారణను నిలిపివేశారు. దీనిపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ కూడా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
కాగా, ఫర్నీచర్ ను లాయర్లు ధ్వంసం చేశారని, సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఘజియాబాద్ అడిషనల్ కమిషనర్ దినేశ్ కుమార్ తెలిపారు.
అసలేం జరిగిందంటే..
ఓ కేసులో బెయిల్ పిటిషన్ కు సంబంధించి జడ్జి, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. యాంటిసిపెటరీ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం జడ్జి చాంబర్ లో విచారణ జరిగింది. పిటిషన్‌ను వేరే బెంచ్‌కు ట్రాన్స్ ఫర్ చేయాలని పిటిషనర్ తరఫు లాయర్ కోరగా, జడ్జి అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో జడ్జి, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది.
అప్పటికే అక్కడున్న లాయర్లు అందరూ కలిసి జడ్జి తీరుకు నిరసనగా ఆయన చాంబర్ లో ఆందోళన చేపట్టారు. జడ్జికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జడ్జి చాంబర్ నుంచి లాయర్లను బయటకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో లాఠీచార్జ్ చేశారు. లాయర్లందరినీ కోర్టు బయటకు పంపించారు.
పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు కాంప్లెక్స్ లోని పోలీస్ పోస్టును ధ్వంసం చేశారు. లాఠీచార్జ్ కు నిరసనగా ఆందోళన చేపట్టారు.