బీజేపీ నేషనల్ కమిటీలో లక్ష్మణ్, డీకే అరుణ

బీజేపీ నేషనల్ కమిటీలో లక్ష్మణ్, డీకే అరుణ

70 మందితో కొత్త టీం ప్రకటించిన పార్టీ చీఫ్ నడ్డా

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్

నేషనల్ వైస్ ప్రెసిడెంట్​గా అరుణ

ఏపీ నుంచి పురందేశ్వరికి చోటు.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం

మోడీ, షా శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, హైదరాబాద్, వెలుగు: సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణలకు బీజేపీ నేషనల్ కమిటీలో చోటు దక్కింది. ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా అరుణ నియమితులయ్యారు. నిన్నటిదాకా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మురళీధర్ రావుకు ఈసారి అవకాశం రాలేదు. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని జాతీ య ప్రధాన కార్యదర్శిగా, సత్య కుమార్ ను నేషనల్ సెక్రటరీగా నియమించారు. ఈ మేరకు శనివారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు. మొత్తంగా 12 మంది ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శలు, ముగ్గురు జాయింట్ జనరల్ సెక్రటరీలు, 13 మంది జాతీయ కార్యదర్శులు, 23 మంది జాతీయ అధికార ప్రతినిధులు, మరో 10 మంది ఇతర పదవుల్లో నియమితులయ్యారు.

సీనియర్… ఫైర్ బ్రాండ్

బీజేపీ స్టేట్ మాజీ చీఫ్ లక్ష్మణ్ కు జాతీయ కార్యవర్గంలో కీలక పోస్ట్ దక్కింది. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఆయన నియమితులయ్యారు. ఇక తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా డీకే అరుణకు స్టేట్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదిరించగల సత్తా ఉన్న నేతగా ఆమె పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు చోటు లభించడంతో పార్టీ క్యాడర్‌లో సంతోషం వ్యక్తమవుతోంది. శనివారం హైదరాబాద్ లోని ఇద్దరు నేతల ఇండ్ల వద్ద సందడి కనిపించింది. పలువురు నాయకులు, కార్యకర్తలు లక్ష్మణ్, అరుణ ఇండ్లకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

రాంమాధవ్, మురళీధర్‌లకు కీలక బాధ్యతలు?

నడ్డా కొత్త టీంలో రాం మాధవ్, మురళీధర్ రావులకు చోటు దక్కలేదు. పార్టీ సీనియర్ నేతలుగా తెలంగాణ, ఏపీ నుంచి వీరిద్దరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ ఇన్​చార్జ్ గా రాం మాధవ్, కర్నాటక ఇన్​చార్జ్ గా మురళీధర్ రావు ఉన్నారు. అయితే వీరిద్దరికీ పార్టీ మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాం మాధవ్ కు సెంట్రల్ మినిస్ట్రీ, లేదా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో బెర్త్ దక్కే అవకాశం ఉందని ఢిల్లీ మీడియాలో చర్చ జరుగుతోంది. అలాగే మురళీధర్ రావు కు మరో ముఖ్య పదవిని ఇవ్వనున్నట్లు దీన్ దయాళ్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జాతీయ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఏపీకి చెందిన జీవీఎల్ నర్సింహారావును పార్టీ పక్కన పెట్టింది.

కొత్త టీంకు మోడీ, షా విషెస్

70 మందితో కూడిన కొత్త జాతీయ కార్యవర్గానికి ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలకు నిస్వార్థంగా, అంకితభావంతో సేవ చేసే బీజేపీ సంప్రదాయాన్ని కొత్త టీం మెంబర్స్ కొనసాగిస్తారన్న నమ్మకం తనకు ఉందని మోడీ ట్వీట్ చేశారు. పేదలు, అట్టడుగు ఉన్నవారిని శక్తివంతం చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీ అంటే ఒక పార్టీ మాత్రమే కాదని, ఒక ఆలోచన అని, బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తుందని అమిత్ షా అన్నారు. ఈ ఆలోచనలను మరింత బలోపేతం చేయడానికి కొత్త కార్యవర్గం పని చేయాలన్నారు. మోడీ మార్గదర్శకత్వంలో, జేపీ నడ్డా నేతృత్వంలో పని చేయాలని సూచించారు.

ఉమెన్ వారియర్స్

జేపీ నడ్డా నేతృత్వంలోని కొత్త టీంలో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మొత్తం 12 మంది జాతీయ ఉపాధ్యక్షుల్లో ఐదుగురు మహిళలకు స్థానం దక్కింది. తెలంగాణతో పాటు రాజస్థాన్, యూపీ, గుజరాత్, జార్ఖండ్ నుంచి మహిళలకు అవకాశం కల్పించారు.  పురందేశ్వరికి నేషనల్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. ఇంకా వివిధ హోదాల్లో మహిళలకు ప్రముఖ స్థానం కల్పించారు.

జాతీయ ఉపాధ్యక్షులు వీళ్లే

మాజీ ముఖ్యమంత్రులు రమణ్ సింగ్ (ఛత్తీస్ గఢ్), వసుంధర రాజే (రాజస్థాన్), రఘుబర్ దాస్ (జార్ఖండ్), కేంద్ర మాజీ మంత్రి రాధా మోహన్  సింగ్ (బీహార్), రేఖ వర్మ (యూపీ), భారతి బెన్ శియాల్ (గుజరాత్), బై జయంత్ జై పాండా(ఒడిశా), ముకుల్ రాయ్ (వెస్ట్ బెంగాల్), అన్నపూర్ణ దేవి (జార్ఖండ్), డీకే అరుణ (తెలంగాణ), ఎం చౌబా (నాగాలాండ్), అబ్దుల్లా కుట్టి (కేరళ).

వివిధ మోర్చాల అధ్యక్షులు

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కె.లక్ష్మణ్ (తెలంగాణ), యువ మోర్చా అధ్యక్షుడిగా తేజస్వీ సూర్య (కర్నాటక), కిసాన్ మోర్చా ప్రెసిండెంట్ గా రాజ్ కుమార్ చహర్ (యూపీ), ఎస్పీ మోర్చా చీఫ్ గా లాల్ సింగ్ ఆర్యా (మధ్య ప్రదేశ్), ఎస్టీ మోర్చా చీఫ్ గా సమీర్ ఓరియన్ (జార్ఖండ్), మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా జమల్ సిద్దీఖీ (మహారాష్ట్ర).

ఓబీసీలను ఏకం చేస్త: లక్ష్మణ్

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఓబీసీలను ఏకం చేస్తానని బీజేపీ ఓబీసీ మోర్చా కొత్త అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఓబీసీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి రావడానికి సహకరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. తనను ఈ పదవిలో నియమించిన పార్టీ చీఫ్ నడ్డాకు, ఇతర నేతలకు థ్యాంక్స్ చెప్పారు.

అధికారమే లక్ష్యంగా పనిచేస్త: అరుణ

తనకు జాతీయ స్థాయిలో పార్టీ పదవి వచ్చినా తన పోరాటమంతా టీఆర్ఎస్ సర్కార్ పైనే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. తన ఫోకస్ అంతా తెలంగాణపైనేనని చెప్పారు. సీఎం కేసీఆర్ ఎలా మోసం చేస్తున్నారు, ఎలా మభ్యపెడుతున్నారనేది ప్రజలకు వివరిస్తానన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రాష్ట్రమంతా పర్యటిస్తానని చెప్పారు.

కలిసికట్టుగా పని చేయాలి: బండి సంజయ్

జాతీయ కార్యవర్గంలో చోటు దక్కించుకున్న లక్ష్మణ్, డీకే అరుణలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చినందుకు కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ నుంచి పోస్టులు పొందిన పురందేశ్వరికి, సత్యకుమార్‌కు కంగ్రాట్స్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి ఫలాల్ని సామాన్య ప్రజలకు చేరువయ్యేలా చూడడమే లక్ష్యంగా పార్టీ నేతలు, శ్రేణులు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరముందని ఓ ప్రకటనలో చెప్పారు. జాతీయ కమిటీలో తెలంగాణ, ఏపీ నేతలకు సరైన ప్రాధాన్యత కల్పించడం ద్వారా రెండు రాష్ట్రాలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందనే విషయం మరోసారి స్పష్టమైందన్నారు.

For More News..

కాంగ్రెస్​ నాకు అన్యాయం చేసింది.. కేసీఆర్​ అవమానించిండు

హేమంత్ హత్యలో కూలీలే కిరాయి హంతకులు

హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లు.. కొబ్బరి నీళ్లెప్పుడైతయ్