సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా? కేసీఆర్ కు లక్ష్మణ్ సవాల్

సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా? కేసీఆర్ కు లక్ష్మణ్ సవాల్
  • దోచుకొని దాచుకున్న డబ్బును కక్కిస్తాం
  • అవినీతిని కప్పి పుచ్చుకోవడంలో రాష్ట్ర సర్కార్​కు డాక్టరేట్ ఇవ్వాలి
  • షార్ట్​ టర్మ్​ ఒప్పందాలతో రాష్ట్ర ప్రభుత్వానికి 12 వేల కోట్ల నష్టం
  • రాజకీయ, న్యాయ పోరాటాలకు మేము సిద్ధం
  • సీఎం సమాధానం చెప్పకుండా అధికారులతో చెప్పించడమేంది?
  • టీఆర్​ఎస్​ను నిద్రపోనిచ్చేది లేదని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: టీఆర్​ఎస్​ సర్కార్​ ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలపై తాము ఇటీవల లేవనెత్తిన అంశాలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని,  వాటిని నిరూపించేందుకు రెడీగా ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్ రావు ద్వారా సీబీఐ విచారణకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉండాలని ఆయన సవాల్ విసిరారు. విద్యుత్ కు సంబంధించిన పలు అంశాలను తాము లేవనెత్తితే, సీఎం సూటిగా సమాధానం చెప్పడం లేదని, టీఆర్​ఎస్​ శ్రేణులను రొచ్చగొడుతూ ఎదురుదాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. నేరుగా సీఎం కేసీఆర్​ సమాధానం చెప్పకుండా ప్రభాకర్ రావు ద్వారా చెప్పించడమేమిటని ప్రశ్నించారు. అధికారులను బలిపశువులను చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.

సోమవారం బీజేపీ రాష్ట్ర  కార్యాలయంలో  లక్ష్మణ్​మీడియాతో మాట్లాడారు. విద్యుత్​ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల బకాయి ఉన్నది వాస్తవం కాదా…? అని కేసీఆర్​ను ప్రశ్నించారు.  లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన విద్యుత్​ వాడకంపై రూ. 7 వేల కోట్లు బకాయి ఉన్నది నిజం కాదా అని నిలదీశారు. ‘‘ఛత్తీస్​గఢ్​లోని విద్యుత్​ సంస్థలకు  రూ. 18 వందల కోట్లు బకాయిలు పడలేదా?  సోలార్ సంస్థలకు రూ. 3 వేల కోట్లు బకాయిలు ఉన్నది వాస్తవం కాదంటారా?  చివరకు సోలార్ కంపెనీలకు సంబంధించిన 300 కోట్ల రూపాయల సబ్సిడీలు  చెల్లించకపోవడంతో అనేక సోలార్ సంస్థల నిర్వాహకులు ఆత్మహత్యలు  చేసుకునేలా చేసింది నిజం కాదా” అని ప్రశ్నించారు. ‘‘స్వయాన విద్యుత్ శాఖను నిర్వహిస్తున్న సీఎం.. విద్యుత్ సంస్థలకు 20 వేల కోట్ల పైచిలుకు నష్టాన్ని కలిగించడానికి కారణం చేతగాని తనమా? అసంబద్ధ నిర్ణయాలా?  అవినీతి అక్రమాలా?” అని దుయ్యబట్టారు. బహిరంగ మార్కెట్లో 3.50 రూపాయలకు యూనిట్ చొప్పున విద్యుత్​ దొరుకుతున్న సమయంలో ఛత్తీస్​గఢ్ ప్రభుత్వంతో  5.50 రూపాయలకు ఎలా ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఛత్తీస్​గఢ్​లో ప్రభుత్వం బీజేపీదేనని తమపై విమర్శలకు దిగుతున్నారని, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఎక్కువ ధర చెల్లిస్తామంటే వద్దంటుందా అని లక్ష్మణ్ నిలదీశారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ కొనుగోలుపై ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు.

ఆ ఒప్పందాలతో వేల కోట్ల నష్టాలు

కేంద్ర ప్రభుత్వం 2014లో విద్యుత్​ ఒప్పందాలు, కొనుగోళ్ల పై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని, ఏ రాష్ట్రమైనా 4.50 రూపాయల కన్నా తక్కవకే యూనిట్​ విద్యుత్ ను కొనుగోలు చేయాలని అందులో  కోరిందని లక్ష్మణ్​ తెలిపారు. అయితే ఓపెన్ బిడ్డింగ్ లో మాత్రం ఎక్కువ ధరకు విద్యుత్​ను కొనుగోలు చేసే పరిస్థితి వచ్చినట్లయితే అది కేంద్రమే భరిస్తుందని గుర్తుచేశారు. ఇది కాదని, కేంద్ర మార్గదర్శకాలకు భిన్నంగా  2వేల మెగవాట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 5.50 రూపాయలకు ఎలా  పీపీఏ కుదుర్చుకుందని ప్రశ్నించారు. ఈ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో  తిరుమల తిరుపతి దేవస్థానం 4. 49 రూపాయలకు, రాజస్థాన్ 4.30 రూపాయలకు ఒప్పందం చేసుకున్నాయని ఆయన గుర్తుచేశారు.

సీఎం కేసీఆర్​ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 8 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. ఇవన్నీ తిరిగి విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై భారం వేయడమేనన్నారు. సబ్ క్రిటికల్ యంత్రాలను వాడరాదని,  అలాగే 500, 600, 800 మెగావాట్ల విద్యుత్  కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం  ఆదేశాలు ఉన్నప్పటికీ.. తమది కొత్త రాష్ట్రమని, తొందరగా విద్యుత్​ ఉత్పత్తి, సరఫరా కోసం 270 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి కేంద్రానికి అనుమతి ఇవ్వాలని టీఆర్ఎస్ సర్కార్ కేంద్రాన్ని కోరిన విషయాన్ని లక్ష్మణ్ గుర్తు చేశారు.

మానవతా దృక్పథంతో కేంద్రం అనుమతినిస్తే.. తమ తప్పు ఏమీ లేనట్లు రాష్ట్ర సర్కార్​ కేంద్రంపై నెట్టడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇండియన్ బుల్స్ కు సంబంధించిన తుప్పు పట్టిన, పనికి రాని , మూలకున్న యంత్రాలను బీహెచ్​ఈఎల్  ద్వారా ఒప్పందం చేయించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతులు కాల్చుకుందన్నారు. ఇప్పుడిది రాష్ట్ర ప్రభుత్వానికి గుది బండగా మారిందని తెలిపారు. 2017 లోపు ఈ విద్యుత్​ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్లు దాటినా పూర్తి చేయలేదన్నారు. చిన్న, చిన్న పవర్ ప్రాజెక్టులతో భారీ నష్టాలు ఉంటాయని కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం వినలేదని దుయ్యబట్టారు.  విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్  ముందు ప్రజలు ఈ విద్యుత్​ కేంద్రంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా పంతానికి పోయిందని మండిపడ్డారు. 12 ఏండ్ల పాటు చేసుకున్న ఈ ఒప్పందంతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 12 వేల కోట్ల నష్టం జరిగిందని వివరించారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాలి

సోలార్  విద్యుత్ వినియోగం కోసం  రైతుల పేరు చెప్పి ఈ ప్రభుత్వం ఎన్ని షార్ట్ టర్మ్ ఒప్పందాలు చేసుకుందో బయటపెట్టాలని, వీటిలో ఎన్నింటిని పబ్లిక్​ హియరింగ్ ద్వారా ఒప్పందాలు చేసుకుందో చెప్పాలని లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు. ఎన్నింటికి ఈఆర్సీ అనుమతి ఇచ్చిందని, ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ఎన్ని ఒప్పందాలు చేసుకుందని, ఇందులో విద్యుత్ వినియోగం చేసుకోకుండానే డబ్బులు ఎన్నింటికి చెల్లించారని ఆయన ప్రశ్నించారు. వీటన్నింటి పై తమకు ఖచ్చితమైన జవాబు ఇవ్వాలని, ఇందులో ప్రభాకర్ రావును బలి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం తమ అవినీతి, అక్రమాలను, లొసుగులను కప్పి పుచ్చుకునేందుకు విద్యుత్​ రెగ్యులేటరీ కమిషన్ ను కూడా దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. కమిషన్​లో ముగ్గురు సభ్యులుండగా, గత సంవత్సరం నుంచి ఒక్కరు కూడా లేరని చెప్పారు.