
న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్లు పెంచుతున్నట్టు ప్రకటించారు. దిగుమతి చేసుకునే రాగిపై 50శాతం టారిఫ్,ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 200శాతం వరకు టారిఫ్ విధించనున్నట్లు హెచ్చరించారు. ఈ నిర్ణయం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. భారత్ అమెరికాకు రాగిని ఎగుమతి చేసే ముఖ్యమైన దేశాలలో ఒకటి.
అయితే, ఈ 50శాతం టారిఫ్ భారతదేశంలోని రాగి ఎగుమతిదారులపై భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ, దేశీయంగా రాగికి బలమైన డిమాండ్ ఉన్నందున, ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. మనదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రాగి 10 వేల టన్నులే కాబట్టి ఎఫెక్ట్తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఫార్మా విషయంలో మాత్రం మనదేశ కంపెనీలకు ఇబ్బందులు ఏర్పడవచ్చని అంటున్నారు.
భారత్కు అమెరికా అతిపెద్ద ఫార్మా ఎగుమతి మార్కెట్. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతయ్యే మొత్తం ఫార్మా ఉత్పత్తులలో 40శాతం వరకు అక్కడికే వెళ్తాయి. 200శాతం టారిఫ్ అమలైతే, భారతీయ ఫార్మా పరిశ్రమకు ఇది భారీ దెబ్బ. ముఖ్యంగా, తక్కువ ధరల జనరిక్ మందులను సరఫరా చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టారిఫ్లు అమెరికాలో మందుల ధరలను పెంచే అవకాశం ఉంది.
ఈ కొత్త టారిఫ్లు భారతీయ ఎగుమతులను ప్రభావితం చేస్తాయి. సంబంధిత రంగాలలో ఆదాయ నష్టాలు ఉండవచ్చు. భారత ప్రభుత్వం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా ఈ సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో భారత కంపెనీలు ఇతర మార్కెట్లవైపు చూసే అవకాశాలు ఉన్నాయి. మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు.