తప్పుడు లెక్కలు..తప్పుడు మాటలు..అబద్ధాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్నరు: హరీశ్ రావు

తప్పుడు లెక్కలు..తప్పుడు మాటలు..అబద్ధాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్నరు: హరీశ్ రావు
  • కాంగ్రెస్​ను, రేవంత్​ను కొరడాతో కొట్టాలని కామెంట్

హైదరాబాద్, వెలుగు: లిఫ్టుల పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. కాంగ్రెస్​ ప్రభుత్వం అబద్ధాలతో నిండిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ)ల కంపు పెడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. నిజాలు చెప్పే దమ్ములేక తప్పుడు లెక్కలు.. తప్పుడు మాటలతో  మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 

సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి పనికి రాని పీపీటీలతో మరోసారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నీటి వాటాలపై మంత్రి ఉత్తమ్ ఇచ్చిన పీపీటీపై బుధవారం ఆయన స్పందించారు. 50 ఏండ్ల పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని, సాగు రంగాన్ని నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు.

 ‘‘గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పజెప్పిన కాంగ్రెస్ నాయకులను కొరడా దెబ్బలు కొట్టాలె. బనకచర్ల ద్వారా ఏపీకి గోదావరి, కృష్ణా నీళ్లను ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్న నిన్ను కొరడా దెబ్బలు కొట్టాలె రేవంత్ రెడ్డి’’ అని అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాలను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందంటూ సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించారని హరీశ్ ఆరోపించారు. ఏ సమస్య లేకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టిందని చెప్పడం పచ్చి అబద్దమన్నారు.

జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​ డిపాజిట్లు పోవాలె

తెలంగాణ మొత్తం ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని హరీశ్ రావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్​లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మైనారిటీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ సర్కారు మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్​లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలన్నారు.