బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు.. 7 వేల 754 ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. టికెట్ రేట్ల పరిస్థితి ఏంటంటే..

బ‌తుక‌మ్మ, దసరా పండుగలకు.. 7 వేల 754 ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. టికెట్ రేట్ల పరిస్థితి ఏంటంటే..

హైదరాబాద్: బ‌తుక‌మ్మ, దసరా పండుగల సందర్భంగా 7 వేల 754 ప్రత్యేక బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడుపుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. 377 స్పెష‌ల్ సర్వీసు బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని TGSRTC క‌ల్పించింది.

సద్దుల బ‌తుకమ్మ సెప్టెంబర్ 30న‌, దసరా అక్టోబ‌ర్ 2న ఉన్నందున.. ఈ నెల 27 నుంచే సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే అవ‌కాశ‌ముండ‌టంతో ఆ మేర‌కు ప్రత్యేక బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అలాగే, తిరుగు ప్రయాణానికి సంబంధించి అక్టోబర్ 5, 6వ తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నట్లు పేర్కొంది.

హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్లు అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ఈ ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.

దసరా స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 16 ప్రకారం తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధ‌ర‌లను సంస్థ సవరించనుంది. సెప్టెంబర్ 20తో పాటు 27 నుంచి 30వ తేదీ వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే సవరణ ఛార్జీలు అమల్లో ఉంటాయి. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల చార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. అవి యధావిధిగా ఉంటాయి.

ALSO READ : హైదరాబాద్ లో మళ్ళీ మొదలైన వర్షం... 

గ‌తేడాది దసరా సమయంలో నడిపిన బస్సుల కంటే ఈ సారి అద‌నంగా 617 ప్రత్యేక బ‌స్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది. పండుగలకు రద్దీ ఎక్కువగా ఉందని వైట్ నంబర్ ప్లేట్ ఉన్న ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి.. ఇబ్బందులు పడొద్దని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ సూచించారు. టీజీఎస్ఆర్టీసీలో ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు ఉన్నారని, వారు సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తారని ఆయన తెలిపారు.