ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ తీగ లాగుతుంటే.. మోడీ డొంక కదులుతోంది: షర్మిల సంచలన ట్వీట్

ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ తీగ లాగుతుంటే.. మోడీ డొంక కదులుతోంది: షర్మిల సంచలన ట్వీట్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ల చోరీ ఉద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బుధవారం ( సెప్టెంబర్ 18 ) ఓట్ల చోరీపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. అక్రమంగా ఓట్లు తొలగించరాని.. ఓట్ల చోరీ జరిగిందని అనటానికి తన దగ్గర 100 శాతం పక్కా ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఓట్ల చోరీ అంశంపై ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ తీగ లాగుతుంటే మోడీ డొంక కదులుతోందని అన్నారు.

ఓట్ల దొంగ మోడీ బాగోతం ఒక్కొక్కటిగా బట్టబయలవుతుందని... కాంగ్రెస్ ను దెబ్బకొట్టేందుకు పథకం ప్రకారమే దేశంలో ఓట్ చోర్ జరిగిందని అన్నారు షర్మిల. నేడు ఎన్నికల సంఘంపై  రాహుల్ జి పేల్చింది హైడ్రోజన్ బాంబే అని..  వాస్తవాలను ఆధారాలతో సహా రాహుల్ గాంధీ గారు దేశం ముందుంచారని అన్నారు. ఓట్ల దొంగను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలా కాపాడుతున్నారో కళ్ళకు కట్టినట్లు వివరించారని అన్నారు. ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికారం కోసం మోడీ గారు చేసింది నిజంగా చీకటి రాజకీయమేనని అన్నారు షర్మిల.

 

ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని... లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసిందని మండిపడ్డారు. మోడీ గారి కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు , వద్దనుకున్న చోట్ల ఓట్లు తొలగించి బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలా మారిందని అన్నారు షర్మిల. కాంగ్రెస్ విజయం సాధించే అలంద్ నియోజక వర్గంలో 6వేల ఓట్లను నకిలీ లాగిన్లతో తొలగించడం సహించరాని చర్య అని అన్నారు. సాఫ్ట్ వేర్ ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ఉపయోగించడం అంటే ఇది దేశ ద్రోహంతో సమానమని అన్నారు. నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో అక్రమంగా ఓట్లను తొలగించడం ఉగ్రవాద చర్యకు నిదర్శనంమని అన్నారు షర్మిల.

 

రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిన విధంగా ఎన్నికల సంఘం వెంటనే స్పందించాలని అన్నారు. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు బయటపెట్టాలని.. వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, ఓటీపీల సమాచారం విడుదల చేయాలని డిమాండ్ చేసారు షర్మిల. లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుందని... ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని ఎన్నికల సంఘం స్వయంగా కాపాడుతున్నట్టు పరిగణించాల్సి ఉంటుందని అన్నారు షర్మిల.