
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాష్ట్రపతి నివేదిక కోరినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై ఎదురుదాడికి దిగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని ప్రగతి మహా విద్యాలయ డిగ్రీ కాలేజీకి ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి బుధవారం ఆయన వెళ్లారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఆత్మహత్య చేసుకున్న అనామిక సోదరి ఉదయశ్రీతో మాట్లాడారు. ఆమె కాలేజీ ఫీజు రద్దు చేయాలని యాజమాన్యాన్ని కోరగా సానుకూలంగా స్పందించింది. పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం పార్టీ తరఫున ఉదయశ్రీకి రూ.15 వేల చెక్కును అందజేశారు. తర్వాత లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. స్టూడెంట్ల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి సీఎస్ కచ్చితంగా నివేదిక పంపి తీరాలన్నారు. ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ల కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించకపోవడం దురదృష్టకరమన్నారు.