మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజల అనంతరం బాలాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ఠ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభించారు.
ఈఓ ఎస్. మహేశ్ ఆధ్వర్యంలో స్వామి వారికి పూలు, పండ్లు సమర్పించారు. శృంగేరి జగద్గురువు శిష్యబృందంతో పాటు తొమ్మిది మంది వేద పండితుల ఆధ్వర్యంలో మహా గణపతి పూజ అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో పంచబ్రహ్మ హోమం, శాంతి పూజలు, ప్రాయశ్చిత్త హోమాలు జరిపారు.
అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. విజయ గణపతి, పార్వతి (శుభానంద) మాత, మహా సరస్వతి మాత, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లోనూ పూజలు నిర్వహించి, పంచలోహ బిందెలలో ప్రాణప్రతిష్ఠ చేశారు. బాలాలయ పూజల కోసం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతీ స్వామి పంపించిన చిన్న లింగాలకు పూజలు చేశారు.
అనంతరం బాజాభజంత్రీలు, వేదమంత్రోచ్ఛరణల మధ్య ప్రధాన అర్చకులు నగేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఐదుగురు అర్చకులు కళశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి, ఆదిముక్తీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయ మండపంలో ప్రతిష్ఠ చేపట్టారు. దేవస్థాన చైర్మన్ మోహన్ శర్మ, ధర్మకర్తలు సత్యనారాయణ, సీతయ్య, శ్యాంసుందర్, సీతారాం, దుర్గయ్య, అశోక్, పద్మ, రాజయ్య, ప్రశాంత్‌రెడ్డి, శ్రీధర్‌రావు, సత్యం పాల్గొన్నారు.
