
హైదరాబాద్, వెలుగు: శివారు ప్రాంతాల్లో 46 ఇండ్లు దోచుకొని..ప్లాట్‌కొని ఇల్లు కట్టుకుంటున్న భార్యాభర్తలను ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి 26 తులాల బంగారు నగలు, 40 తులాల వెండి, రెండు బైకులు, ఓ ప్లాట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన కత్తి రవికుమార్(25) లేబర్‌గా పనిచేస్తున్నాడు. భార్య మేకల గీతాంజలి(21)తో కలిసి ఇండ్లలో చోరీలకు స్కెచ్ వేశాడు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నివాసం ఉంటున్నారు. దొంగిలించిన బైక్‌లపై భార్యతో తిరుగుతూ శివారు ఏరియాల్లోని కాలనీల్లో రెక్కీ చేసేవాడు. టార్గెట్ చేసిన ఇండ్ల డోర్లను బ్రేక్ చేసి దోచుకునేవాడు. ఇలా 2016లో గుంటూరు12 దొంగతనాలు చేశాడు. తరువాత 2017లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 16 ఇండ్లను లూఠీ చేశాడు. ఈ క్రమంలో అరెస్టై జైలుకు వెళ్లాడు. కిందటేడాది సెప్టెంబర్‌లో ఒంగోలు జైలు నుంచి విడుదలై నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో షెల్టర్ తీసుకున్నారు. తరువాత అనంతపూరం, కర్నూల్‌లో చోరీలు చేశాడు. ఈ ఏడాది రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 దొంగతనాలు చేశారు. ఇబ్రహింపట్నంలో నమోదైన కేసులు ఎంక్వైరీ చేస్తున్న ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులు మంగళవారం వీరిని అరెస్ట్ చేశారు.