ఇసుకేస్తే రాలనంత రద్దీ జాతరను తలపించిన ఎల్బీనగర్ పరిసరాలు

ఇసుకేస్తే రాలనంత రద్దీ జాతరను తలపించిన ఎల్బీనగర్ పరిసరాలు

ఎల్బీనగర్, వెలుగు: విజయవాడ– హైదరాబాద్ హైవేపై సోమవారం కూడా భారీ వాహన రద్దీ నెలకొంది. దసరా తెల్లారి శుక్రవారం నుంచి మొదలైన ఈ రద్దీ సోమవారం రాత్రి వరకు కొనసాగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే బస్సులతో పాటు ప్రైవేట్ వెహికల్స్, ట్రావెల్స్​లో వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్​లో దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.  గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్​లో చిక్కుకోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ట్రాఫిక్ లో చాలా అంబులెన్స్​లు చిక్కుకున్నాయి. 

టికెట్ తీసుకోవడానికే గంట! 

ఎల్బీనగర్ మెట్రో స్టేషన్​ జాతరను తలపించింది. జిల్లాల నుంచి వచ్చిన ప్రయాణికులు సిటీలోని తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రోను ఆశ్రయించడంతో కిక్కిరిసింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రత్యేక క్యూలైన్​ను ఏర్పాటు చేయగా, టికెట్ కౌంటర్ నుంచి స్టేషన్ కింద కిలోమీటర్ వరకు క్యూ చేరింది. ఎస్కలేటర్లు ఆపేశారు. టికెట్ తీసుకోవడానికే గంట పట్టింది.

 ఆ ప్రమాదంతోనే ఇంత ట్రాఫిక్

 యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదమే ఇంత ట్రాఫిక్​కు కారణమైందని ఎల్బీనగర్ ఇన్​స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. సిటీకి వచ్చే వాహనాలు అక్కడ ఆగిపోవడం, ఆ తర్వాత ఒక్కసారిగా కదలడంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎల్బీనగర్​లో ఇద్దరు 
ఇన్​స్పెక్టర్లు, నలుగురు ఎస్‌‌‌‌ఐలు, 65 మంది పోలీసులతో ట్రాఫిక్​ను డైవర్ట్ చేసి త్వరగా క్లియర్ చేసినట్లు తెలిపారు.