
- తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
- సీఐడీతో విచారణ చేయించాలి
- ఎల్ బీనగర్ బీజేపీ నేతల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అత్త, మామ తప్పుడు ఇన్ కమ్ సర్టిఫికెట్తో సీఎంఆర్ఎఫ్ కింద రూ.19 లక్షలు పొందారని మన్సూరాబాద్ కార్పొరేటర్, జీహెచ్ ఎంసీ బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహారెడ్డి ఆరోపించారు. ఆదివారం బర్కత్ పురాలోని బీజేపీ జిల్లా ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బావమరిదికి చెందిన ఓమ్ని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొంది, ఆపై సీఎంఆర్ఎఫ్ కింద బిల్లులు తీసుకున్నారన్నారు. ఇందుకు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఆఫీసు నుంచి తప్పుడు ఇన్ కమ్ సర్టిఫికెట్ తీసుకున్నారన్నారు.
పేదలు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంటే రూ. వేలల్లో మాత్రమే ఇస్తున్నారన్నారు. అదే ఎమ్మెల్యే అత్త మామకు రూ. లక్షల్లో ఎలా ఇస్తారని..? వాళ్లు ఏమైనా గరీబోళ్లా..? వారికి సీఎంఆర్ఎఫ్ కావాలా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మామ సాంబిరెడ్డి, అత్త సాయమ్మ పేరిట తప్పుడు సర్టిఫికెట్ఇచ్చిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని, సీఐడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, చంపాపేట్ డివిజన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉన్నారు.