సీఎం నియోజకవర్గం గజ్వేల్​పై నేతలు, ఆఫీసర్లు ఫోకస్

సీఎం నియోజకవర్గం గజ్వేల్​పై నేతలు, ఆఫీసర్లు ఫోకస్
  • పెండింగ్ పనులన్నీ స్పీడప్.. ప్రారంభోత్సవాలకు ప్లాన్​ 
  • నిర్వాసితుల సమస్యలపైనా ఆరా
  • అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్లు రిలీజ్​

సిద్దిపేట, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంపై అధికారులు, అధికార పార్టీ లీడర్లు ఫోకస్ పెట్టారు. నియోజకవర్గంలో పెండింగ్ పనులు లేకుండా చూడాలని పైనుంచి వచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఇప్పటికే ప్రారంభమైన పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రయార్టీ ఇస్తున్నారు. మరికొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించేందుకూ ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్​తోపాటు కామారెడ్డి నుంచీ పోటీ చేస్తానని కేసీఆర్​ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కామారెడ్డి బీజేపీ నేతలు గజ్వేల్ లో సీఎం చేసిన అభివృద్ధిపై ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చలో గజ్వేల్ కు సైతం పిలుపునిచ్చారు. కేసీఆర్ నియోజకవర్గంలోనే అనేక పనులు పెండింగ్ లో ఉన్నాయని, నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపలేదని పేర్కొంటూ పర్యటనకు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్​ అయిన అధికార పార్టీ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు.  నత్తనడకన సాగుతున్న పనుల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ పథకాల అమలుపైనా దృష్టి పెట్టాలని అధికారులను పురమాయిస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని అధికార పార్టీ నేతలు మోడల్ గా చూపిస్తుండడంతో రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రంగా మారకుండా పావులు కదుపుతున్నారు.

ఐఓసీ పనులు వేగవంతం 

గజ్వేల్ నియోజకవర్గంలోని నాలుగు మండల కేంద్రాల్లో 20 కోట్ల వ్యయంతో సమీకృత కార్యాలయ సముదాయాల (ఐఓసీ)ల నిర్మాణం కొంతకాలంగా కొనసాగుతున్నది. ఒక్కో ఐఓసీని ఐదు కోట్లతో కడుతున్నారు. ములుగులోని ఐఓసీ పనుల్లో వేగం పెంచాలని ఇటీవల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కొండపాక, జగదేవ్ పూర్, మర్కుక్ మండల ఐఓసీ పనులు తుది దశకు చేరడంతో నెలాఖరులోగా ప్రారంభోత్సవాలు జరిపేందుకు ప్లాన్​ చేస్తున్నారు. ఈ పనులపై కలెక్టర్​ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 

ప్రారంభానికి సిద్ధమైన ఎంసీహెచ్

గజ్వేల్​లో మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి నిర్మాణం తుది దశకు చేరింది. దాదాపు రూ.27.35 కోట్లతో 2021లో ఈ ఆస్పత్రి పనులను ప్రారంభించారు. నత్తనడకన సాగుతున్న ఈ పనుల్లో ఇటీవలే వేగం పెంచారు. ఈ ఆస్పత్రిలో చైల్డ్ ఎంసీయూ, స్పెషల్ వార్డులు, ఎస్ఎంసీయూలతోపాటు ఆపరేషన్ థియేటర్లు, లేబర్ రూమ్స్, ఓపీ, ఫ్యామిలీ ప్లానింగ్, ఫీడింగ్ కేంద్రాలు ఉండేలా ప్లాన్ చేశారు. కొద్ది రోజుల్లోనే ఈ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

నిర్వాసితుల సమస్యలపై దృష్టి

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై అధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటున్న నిర్వాసితులు ఆందోళనకు దిగి సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్​ ముట్టడికి బయలుదేరి రాజీవ్ రహదారిపై బైఠాయించారు. దీంతో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ఇటీవల ఏటిగడ్డ కిష్టాపూర్ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. పెండింగ్ సమస్యలపై నివేదికలను సిద్ధం చేస్తున్నారు. 

‘దళిత బంధు’పై బుజ్జగింపులు 

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా గజ్వేల్​లో దళిత బంధు కోసం రోడ్డెక్కిన ఘటనలు చోటుచేసుకోవడంతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆ విషయంపై దృష్టి పెట్టారు. ఆందోళనలు జరిగిన గ్రామాల్లో బుజ్జగింపు పర్వానికి తెరలేపారు. అందరికీ దళిత బంధు వస్తుందని నచ్చజెప్పడంతో కొద్ది రోజులుగా దళిత బంధుపై ఆందోళనలు సద్దుమణిగాయి. ఇదే సమయంలో గృహలక్ష్మి, బీసీ బంధుతోపాటు ఇతర పథకాల విషయంలోనూ ఆందోళనలు జరగకుండా అధికార పార్టీ నేతలు జాగ్రత్తగా ఉంటున్నారు. 

తుది దశకు బస్టాండ్ పనులు

గజ్వేల్ బస్టాండ్ పనులు తుది దశకు చేరాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో బస్టాండ్ దుస్థితి ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన విషయం తెలిసిందే. గజ్వేల్​లో అలాంటి అవకాశం ప్రతిపక్షాలకు ఇవ్వొద్దన్న ఆలోచనతో యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేస్తున్నారు. ఈ నెలఖారులోగా కొత్త బస్టాండ్ ను ప్రారంభించడానికి ప్లాన్​ చేస్తున్నారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్ లో బస్ బేల నిర్మాణ పనులనూ ఇటీవలే ప్రారంభించారు. 

గ్రామాల అభివృద్ధికి 75 కోట్లు

గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.75 కోట్లను విడుదల చేశారు. పెండింగ్​ పనుల కోసం నిధులను కేటాయించారు. గజ్వేల్ సబ్ డివిజన్ కు 40 కోట్లు, వర్గల్ సబ్ డివిజన్ కు  26.45 కోట్లు, తూప్రాన్ సబ్ డివిజన్ కు 11.66 కోట్లు, కొండపాక, కుకునూరుపల్లి మండలాలకు 8.90 కోట్లు, మనోహరాబాద్ మండలానికి  4.93 కోట్లు మంజూరు చేశారు. వీటితో ఆత్మగౌరవ భవనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేయనున్నారు.