అవిశ్వాసాల అలజడి..సొసైటీలు, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ నేతల తిరుగుబాటు

అవిశ్వాసాల అలజడి..సొసైటీలు, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ నేతల తిరుగుబాటు
  • బీఆర్​ఎస్​లో రచ్చకెక్కుతున్న గ్రూపుల లొల్లి

కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతున్నాయి. మరో ఏడాది పదవీకాలం పాటు ఉన్న సొసైటీలు, మున్సిపాలిటీల్లో  అవిశ్వాసాలకు తెరలేపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలపై సొంత పార్టీ సభ్యులే  అవిశ్వాసం ప్రకటిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఇప్పటికే  కొన్ని పాలకవర్గాలపై అవిశ్వాసాలు ప్రతిపాదిస్తూ ఆఫీసర్లకు లేఖలు అందాయి. గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లు రాష్ట్రంలో బీఆర్ఎస్​ అధికారంలో ఉంది. దీంతో బీఆర్​ఎస్​కు చెందిన లీడర్లే మున్సిపాలిటీలు, సొసైటీలకు చైర్మన్లు, వైస్ ​చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలుగా కొనసాగుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ​అధికారాన్ని కోల్పోయింది. ఉమ్మడి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ ​విజయం సాధించగా, మిగిలిన ఏడు స్థానాలను కాంగ్రెస్, బీజేపీ దక్కించుకున్నాయి. దీంతో సొంత పార్టీ నేతలపై  అసంతృప్తి పెలుబుకుతోంది. తమ పార్టీకి చెందిన చైర్మన్లు, వైస్​చైర్మన్లపై అవిశ్వాసాలకు తెరలేపుతున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల సొసైటీ చైర్మన్​ నల్లవెల్లి అశోక్, వైస్​ చైర్మన్​ ఆముదాల రమేశ్​పై సొంత పార్టీ సభ్యులే జిల్లా సహకార ఆఫీసర్​కు ఇటీవల అవిశ్వాస లేఖ ఇచ్చారు.

వారికి కాంగ్రెస్, సీపీఐకి చెందిన ఒక్కో సభ్యుడు మద్దతు ప్రకటించారు. ఆర్మూర్​ మున్సిపల్ ​చైర్​పర్సన్ ​వినీత (బీఆర్ఎస్)పై సొంత పార్టీకే చెందిన 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు కలెక్టర్​కు వినతి పత్రం అందించారు. ఆయా చోట్ల సొంత పార్టీ లీడర్ల మధ్య కుమ్ములాటలే అవిశ్వాసాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డి జడ్పీలోనూ..

కామారెడ్డి జడ్పీ చైర్మన్ దఫేదర్​ శోభపై కూడా అవిశ్వాసం పెట్టేందుకు ఇటీవల పలువురు జడ్పీటీసీలు ప్రయత్నించారు. ఈ నెల 8న జడ్పీ మీటింగ్ ​జరిగింది. అంతకు మూడు రోజల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలకు చెందిన కొందరు జడ్పీటీసీలు కామారెడ్డి సమీపంలోని ఓ ఫామ్​హౌజ్​లో సమావేశమయ్యారు. చైర్​పర్సన్​పై అవిశ్వాస అంశంపై చర్చించారు. ఈ  విషయం బయటకు పొక్కడంతో బీఆర్ఎస్​ నేతలు అలర్ట్​ అయ్యారు. ఆ పార్టీకి చెందిన జడ్పీటీసీలను బుజ్జగించారు.