పోటాపోటీగా వరదసాయం.. మొన్న పొంగులేటి,ఇవాళ రేగా

పోటాపోటీగా వరదసాయం.. మొన్న పొంగులేటి,ఇవాళ రేగా


భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు టీఆర్ఎస్​ లీడర్లు పోటీ పడ్డారు. జిల్లాలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, పినపాక, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపహడ్​ మండలాలను గోదావరి వరదలు ఈ  నెల మొదట్లో ముంచెత్తాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గోదావరి వరద తగ్గుముఖం పట్టగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తన అనుచరులతో కలిసి వరద బాధితులకు రూ. కోటి విలువైన నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావ్​ ప్రాతినిధ్యం వహించే పినపాక, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపహడ్​ మండలాల్లో పొంగులేటి తన అనుచరులతో కలిసి నిత్యావసరాలు పంపిణీ చేసి వరద బాధితులను ఆదుకోవడంతో ఎమ్మెల్యేకు కొంత ఇబ్బందికరంగా మారింది. పినపాక నియోజకవర్గంలో రేగా, పొంగులేటి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎంపీ పార్థసారథిరెడ్డితో రేగా మాట్లాడడంతో ఆయన రూ. కోటి నిత్యావసర సరుకులు పంపిణీకి హామీ ఇచ్చారు. ఈ సరుకులను శనివారం పినపాక నియోజకవర్గంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఎంపీలు పార్థసారథిరెడ్డి, నామా నాగేశ్వరరావు, మాలోత్​ కవిత, వద్దిరాజు రవి చంద్ర, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాల ఉపేందర్​రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజు పంపిణీ చేశారు. పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి చెక్​ పెట్టే  క్రమంలోనే ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు తరుపున ఎమ్మెల్సీ తాతా మధు ఎంపీలను సమన్వయం​చేశారనే ప్రచారం టీఆర్ఎస్​ పార్టీలో కొనసాగుతోంది. తాతా మధు ఈ వ్యవహారంలో కీలక పాత్ర​పోషిస్తున్న క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తన కుమారుడి పెళ్లి పనుల వల్ల ఈ కార్యక్రమానికి రాలేదు. 

చర్చనీయాంశంగా వాల్​ క్లాక్​ల పంపిణీ 

టీఆర్ఎస్​ లీడర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తన కూతురు పెండ్లి సందర్భంగా తన ఫొటో ముద్రించిన వాల్​ క్లాక్​లను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంపిణీ చేస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తన కుమారుడి పెండ్లి సందర్భంగా ఖమ్మం నియోజకవర్గంలో తన ఫొటోతో పాటు కేసీఆర్, కేటీఆర్​ ఫొటోలు ముద్రించిన వాల్​క్లాక్​లను పంపిణీ చేయడం చర్చానీయాంశంగా మారింది.

బాధితులకు అండగా ఉంటాం

పినపాక/బూర్గంపహడ్: గోదావరి వరద ముంపు బాధితులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. పినపాక మండలం ఏడూళ్లబయ్యారం క్రాస్​రోడ్​లోని ఓ  ఫంక్షన్ హాల్, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో శనివారం బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రతీ ఇంటికి రూ.10 వేల ఆర్థికసాయం, కుటుంబానికి రెండు నెలల పాటు 25 కిలోల బియ్యం అందజేస్తామన్నారు. బాధితులు అధైర్య పడొద్దని సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్​ ముఖ్య నేతలు పాల్గొన్నారు.